ప్రీతిని అపోలో కు షిఫ్ట్ చేయమన్నందుకే డెత్ డిక్లేర్ చేసిన్రు : బూర నర్సయ్య

ప్రీతిని అపోలో కు షిఫ్ట్ చేయమన్నందుకే డెత్ డిక్లేర్ చేసిన్రు : బూర నర్సయ్య

మెడికో స్టూడెంట్ ప్రీతి ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ప్రీతిది హత్యనా, ఆత్మహత్యనా అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చుకోలేక పోతుందన్న ఆయన.. సొంతంగా ఇంజెక్షన్ తీసుకోవడం అసాధ్యమని చెప్పారు. ప్రీతి మెడికల్ వెంటిలేటర్ పై లేదని, పొలిటికల్ వెంటిలేటర్ మీద ఉందని బూర నర్సయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ఆర్సీ ప్రీతిని అపోలో కు షిఫ్ట్ చేయమన్నందుకే డెత్ డిక్లేర్ చేశారని ఆరోపించారు. వెనుకబడిన వారిపై ఆరోపణలు ఉంటే వెంటనే ఎన్ కౌంటర్ అవుతారన్నారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమ వారైతే ప్రభుత్వం వారి తరఫున పోరాడుతుందని చెప్పారు. నేరాలు జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోరని, ట్విట్టర్ లో మెస్సేజ్ వస్తేనో, ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తేనో స్పందిస్తారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

యువకులు మద్యానికి బానిసలై హత్యలు చేస్తున్నారని బూర నర్సయ్య ఆరోపించారు. గతంలో తెలంగాణలో నడిరోడ్డుపై చంపడం చూశామని, పోలీసు వ్యవస్థ ను బీఆర్ఎస్ కు మరో విభాగంగా తయారు చేశారని మండిపడ్డారు. మధ్యం, మత్తు, మతమే రాష్ట్రంలో నేడు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారు అని బూర నర్సయ్య ప్రశ్నించారు. బీజేపీ వి కార్నర్ మీటింగ్ లు అయితే బీఆర్ఎస్ వి క్యాష్ మీటింగ్ లు అంటూ విమర్శలు సంధించారు. రాష్ట్రంలో 11వేల మీటింగ్ లు నిర్వహించామని, ఇది ఏ పార్టీకి సాధ్యం కాదని చెప్పారు. ప్రతి సమావేశంలో 200మంది పాల్గొన్నారన్నారు. రాష్ట్రంలో 60లక్షల మందిని మేం టచ్ చేశామన్న ఆయన... తెలంగాణ ప్రజలు ఓట్లేస్తేనే హీరో లు అవుతారు... లేదంటే జీరోలు అవుతారంటూ వ్యాఖ్యానించారు. పెద్దనాయకులు కాదు..‌ పేద నాయకులను గెలిపించండని కోరారు.

బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని బూర నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక్, విస్తరాకు అంటూ బీజేపీని అవమానించేలా మాట్లాడితే ... భవిష్యత్తులో మీరు వాటిపైనే తినాల్సి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ మీద అభాండాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పిల్లలు పదో తరగతికి కూడా రాకముందే మద్యం తాగుతున్నారని, దాని వల్ల హాస్టల్స్ లో ఆకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎక్సైజ్ ప్రోహిబిషన్ శాఖ కాకుండా ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా పేరు మార్చుకోవాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం అన్ని వర్గాల వారిని వాడుకుని వదిలేస్తోందని బూర నర్సయ్య ఆరోపించారు.