ఎయిర్‌ఫోర్స్‌పై సీడీఎస్ రావత్ వ్యాఖ్యలు.. వాయుసేన చీఫ్ కౌంటర్

ఎయిర్‌ఫోర్స్‌పై సీడీఎస్ రావత్ వ్యాఖ్యలు.. వాయుసేన చీఫ్ కౌంటర్

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఎయిర్‌ ఫోర్స్‌పై చేసిన వ్యాఖ్యల మీద వివాదం రేగుతోంది. ఆర్మీ సైనికులకు సాయం చేసే ఇంజనీర్లలాగే ఎయిర్ ఫోర్స్‌ను చూడాలని ఆయన కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గ్రౌండ్ ఫోర్సెస్‌కు మద్దతునిచ్చే ఓ సపోర్టింగ్ ఆర్మ్‌లాగే వాయు సేనను చూడాలని బిపిన్ అనడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఘాటుగా స్పందించారు. 

గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ (జీసీటీసీ) నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో బిపిన్ రావత్, భదౌరియా పాల్గొన్నారు. వేర్వేరు సెషన్స్‌లో రావత్, భదౌరియా మాట్లాడారు. తొలుత బిపిన్ రావత్ మాట్లాడుతూ.. భారత ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ ఓ సహాయక వ్యవస్థ (సపోర్టింగ్ ఆర్మ్)లా పని చేస్తుందని బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీకి వాయు సేన ఓ అనుబంధ యూనిట్ మాత్రమేనని, దీనిపై వైమానిక దళ కమాండర్ ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదన్నారు. అయితే యుద్ధ సమయాల్లో మాత్రం వాయు సేన నుంచి సహాయం కోసం ఆర్మీ ఎదురు చూస్తుందన్నారు. 

ఈ వ్యాఖ్యలపై భదౌరియా అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ రక్షణకు వాయు సేన పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తాము ఆర్మీకి సాయం అందించే వాళ్లం మాత్రమే కాదని.. యుద్ధ సమయంలో తమ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రమాద సమయాల్లో గ్రౌండ్ ఫోర్సెస్ కంటే ముందుగా ఆయా ప్రాంతాలకు చేరుకోవడాన్ని బట్టి వాయు సేన బలమేంటో అర్థం చేసుకోవాలన్నారు. యుద్ధ సమయాల్లో ఆర్మీకి సహాయంగా ఉండటమే గాక వారిని రక్షించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని పేర్కొన్నారు.