IT News: 15 నిమిషాల్లో రూ.6 వేల 500 కోట్లు నష్టపోయిన TCS : లేఆఫ్స్ దెబ్బకు షేకైన స్టాక్..

IT News: 15 నిమిషాల్లో రూ.6 వేల 500 కోట్లు నష్టపోయిన TCS : లేఆఫ్స్ దెబ్బకు షేకైన స్టాక్..

TCS Stock Fall: వాస్తవానికి ఐటీ ప్రపంచంలో టీసీఎస్ కంపెనీ అతిపెద్దది. అయితే దీనిలో ఉద్యోగం వస్తే గవర్నమెంట్ జాబ్ లాంటిదే అని చాలా మంది భావిస్తుంటారు. ఇతర సంస్థలతో పోల్చితే కొంత తక్కువ శాలరీ ఆఫర్ చేసినప్పటికీ లైఫ్ సెటిల్ అని ఫీలవుతూ ఉంటారు. సమయానికి ఉద్యోగం, టైంకి శాలరీ హైక్స్, అస్సలు మిస్ కాకుండా అందే వేరియబుల్ పే ఇంకా మరెన్నో సౌకర్యాలు ఇకపై కనిపించకపోవచ్చని తెలుస్తోంది. 

కానీ ఐటీ రంగంలో ఏఐ తీసుకొస్తున్న నూతన మార్పులు ఆ పరిశ్రమలోని దిగ్గజ సంస్థలను కూడా మార్చేస్తున్నాయి. రానున్న కాలంలో మారుతున్న వ్యాపార అవసరాలకు సిద్ధంగా లేని లేదా తమ అవసరాలకు సరిపడే స్కిల్స్ ఉండని 12వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేయనున్నట్లు టీసీఎస్ చేసిన ప్రకటన పరిశ్రమలో పెద్ద ప్రకంపనలకు దారితీసింది. 

అయితే ఈ భయాలు ఇక్కడితో ఆగిపోలేదు. టెక్ దిగ్గజం ప్రకటించిన లేఆఫ్స్ ప్రకటనతో టీసీఎస్ స్టాక్ కుప్పకూలుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కేవలం 15 నిమిషాల్లోనే టీసీఎస్ పెట్టుబడిదారుల సంపద రూ.6వేల 550 కోట్ల మేర ఆవిరైంది. దీనికి ముందు సోమవారం మార్కెట్లో టీసీఎస్ షేర్లను ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మేయటంతో రూ.20వేల కోట్ల విలువ ఆవిరైంది. దీంతో స్టాక్ విలువ 33 నెలల దిగువకు జారుకుంది. 2025లో ఇప్పటి వరకు స్టాక్ ఏకంగా 25 శాతం క్షీణతను చూసింది.

ఇవాళ మార్కెట్ల ప్రారంభ సమయంలో పతనం తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11లక్షల కోట్లకు చేరువైంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో టీసీఎస్ షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి స్వల్ప నష్టంతో రూ.3వేల 044 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. నేడు టీసీఎస్ షేర్లు తమ 52వారాల సరికొత్త కనిష్ఠ ధర రూ.3వేల 041ని తాకాయి. అయితే షేర్లలో పతనం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పక్క బ్రోకరేజ్ సంస్థలు కూడా టీసీఎస్ షేర్లకు టార్గెట్ ధరలను రివైజ్ చేస్తున్నాయి. 

ప్రస్తుతం ఉన్న ఆధునిక, పోటీ ప్రపంచంలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు అనే దానికంటే ఎవరి పనితీరు బాగుంది, ఏ కంపెనీ ఎంత ఆదాయాన్ని, లాభాలను పొందుతోంది అనే విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత పెరుగుతోందని పరిశ్రమ వర్గాల పెద్దలు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న అనిశ్చితి వాతావరణం, ఏఐ విస్తృత వ్యాప్తితో టెక్ కంపెనీలు ఉద్యోగులను వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే భారతీయ సంస్థలు దీనిని పరిగణిస్తూ అవసరం మేరకు హై స్కిల్డ్ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.