బ్రెడ్ 5 రూపాయలు పెంచారు.. పేదోడి బ్రేక్ ఫాస్ట్ మరింత కాస్ట్లీ గురూ..!

బ్రెడ్ 5 రూపాయలు పెంచారు.. పేదోడి బ్రేక్ ఫాస్ట్ మరింత కాస్ట్లీ గురూ..!

ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, పూరీ వంటివి మామూలు మధ్య తరగతి, డబ్బున్నోళ్ల ఇళ్లల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కామన్.. అదే పేదోడు.. డబ్బు లేనోళ్ల బ్రేక్ ఫాస్ట్ ఏంటో తెలుసా.. బ్రెడ్.. అవును.. ఓ చిన్న గ్లాస్ పాలలో బ్రెక్ ముక్కలు ముంచుకుని.. ఆ ఉదయానికి బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంటారు.. ముంబై లాంటి మహానగరంలో అయితే బస్తీల్లో ఇది కామన్.. రోజూ ఉదయమే లక్షల సంఖ్యలో బ్రెక్ ప్యాకెట్లు అమ్ముడుపోతుంటాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు ఇటీవల పెరిగిన పాల ధరలతో.. బ్రెక్ ప్యాకెట్ల ధరలు అమాంతం పెంచేశారు వ్యాపారులు. ప్యాకెట్ పై ఏకంగా 5 రూపాయలు పెంచారు.

ముంబైకర్ల జేబులకు చిల్లు పడేలా నిత్యావసరాల ధరలు మళ్లీ మండిపోతున్నాయి. మొన్నటికి మొన్న పాలు, నిన్న పెట్రోల్-డీజిల్.. మరి ఈరోజు ఉదయం లేవగానే ప్లేట్లోకి వచ్చే బ్రెడ్ రేట్లు పెరగటంతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ముంబైలో లీడింగ్ బ్రాండ్ మోడరన్ బ్రెడ్ సంస్థ ప్యాకెట్‌పై ఏకంగా రూ.5 వరకు రేటును పెంచేయడంతో బ్రేక్‌ఫాస్ట్ బడ్జెట్ తలకిందులైంది. మోడరన్ దారిలోనే త్వరలో బ్రిటానియా, విబ్స్ కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి రెడీ అయిపోతున్నాయట.

ఈ ధరల మంటకు కారణం గోధుమలు మాత్రమే కాదు.. అసలు విలన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. అవును బ్రెడ్‌ను ప్యాక్ చేసే ప్లాస్టిక్ రా మెటీరియల్‌ను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రూపాయి విలువ పడిపోవడంతో ఈ దిగుమతులు ప్రియమయ్యాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ప్రిజర్వేటివ్స్, చివరకు ఉప్పు రేటు కూడా పెరగడంతో కంపెనీలు ఆ భారాన్ని కాస్తా కస్టమర్ల నెత్తిన పడేశాయి. పెద్ద బ్రాండ్లే కాదు.. లోకల్ బేకరీల ఓనర్లు సైతం పాత ధరలకు అమ్మితే మేం రోడ్డున పడతాం అంటూ చేతులెత్తేస్తున్నారు.

ముంబైలో 400 గ్రాముల బ్రెడ్ ప్యాకెట్ కొత్త ధరలు :

* శాండ్‌విచ్ బ్రెడ్: రూ. 40 నుండి రూ. 45 కి చేరింది.
* హోల్ వీట్ బ్రెడ్: రూ. 55 నుండి రూ. 60 అయింది.
* మల్టీగ్రెయిన్ బ్రెడ్: రూ. 60 నుండి రూ. 65 కి పెరిగింది.
* బ్రౌన్ బ్రెడ్: రూ. 45 నుండి రూ. 50 కి చేరింది.
* చిన్న వైట్ బ్రెడ్ లోఫ్: రూ. 20 నుండి రూ. 22 అయింది.
* చిన్న బ్రౌన్ బ్రెడ్ లోఫ్: రూ. 28 నుండి రూ. 30 కి పెరిగింది.

తాజా రేట్ల పెంపుతో పాలు, బ్రెడ్ లగ్జరీ వస్తువులు కాదని బతకటానికి తినే కనీస అవసరాలను ముంబై ప్రజలు అంటున్నారు. రోజురోజుకూ రేట్లు పెరిగిపోతోంటే మధ్యతరగతి, పేద కుటుంబాలు బతికేదెలా? అంటూ ముంబై వాసులు లబోదిబోమంటున్నారు. మొత్తానికి ముంబైలో చాయ్-బిస్కెట్, పాలు-బ్రెడ్ లాంటి సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇప్పుడు కాస్ట్‌లీ అఫైర్‌గా మారిపోయింది. త్వరలోనే ఇదే పరిస్థితి ఇతర నగరాలకు పాకే అవకాశం కనిపిస్తోంది.