ప్రధాని సభకు జనం తరలిరావాలని పిలుపు  

ప్రధాని సభకు జనం తరలిరావాలని పిలుపు  

ఈ ప్లాంట్ తో యూరియా కొరత తీరుతది: వివేక్ వెంకటస్వామి 

గోదావరిఖని, వెలుగు: రామగుండంలో 25 ఏండ్ల క్రితం మూతబడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు తన తండ్రి కాకా వెంకటస్వామితో పాటు తాను ఎంతో శ్రమించామని, రూ.10 వేల కోట్ల అప్పు మాఫీ చేయించామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు. బుధవారం ఎన్టీపీసీలో జరిగిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ‘‘ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని ప్రధాని మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌ను కలిసి చాలాసార్లు విన్నవించాను. మోడీ ప్రధాని అయ్యాక యూరియా ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో కేంద్ర మంత్రి భగవంత్‌‌‌‌ ఖుబా పలుసార్లు వచ్చి పరిశీలించారు” అని వివేక్ చెప్పారు. ఈ ప్లాంట్‌‌‌‌లో ఏటా 12.50 లక్షల  టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుందని, ఇక రైతులకు కొరత ఉండదన్నారు. ఈ ప్లాంట్‌‌‌‌ను ఈ నెల 12న  ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారని, ఆ రోజు జరిగే బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రధాని పర్యటనకు సంబంధించిన రూట్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను వివేక్‌‌‌‌ పరిశీలించారు. రామగుండం పోలీస్‌‌‌‌ కమిషనరేట్ అడ్మిన్‌‌‌‌ డీసీపీ అఖిల్‌‌‌‌ మహాజన్, పెద్దపల్లి డీసీపీ రూపేశ్‌‌ కుమార్‌‌, ఏసీపీ గిరిప్రసాద్‌‌‌‌‌‌తో కలిసి బహిరంగ సభ, హెలీప్యాడ్‌‌‌‌, వాహనాల పార్కింగ్‌‌‌‌ స్థలాలను పరిశీలించారు. 

రైతుల కోసమే ప్లాంట్ ఓపెన్: కేంద్ర మంత్రి ఖుబా  

దేశంలో ఎరువుల కొరత తీర్చాలని, రైతులకు ప్రయోజనం కల్పించాలని మూతబడిన ఐదు ప్లాంట్లను కేంద్రం ఓపెన్ చేస్తోందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌‌‌‌ ఖుబా అన్నారు. ఆర్ఎఫ్ సీఎల్ ప్లాంట్, సభ ఏర్పాట్లను సంజయ్‌‌‌‌, వివేక్‌‌ తో కలిసి ఆయన పరిశీలించారు. కాగా, ఎన్టీపీసీలో తన ఇంటికి వచ్చిన ఖుబాను వివేక్ సత్కరించారు.