
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల్లో ఇదే జోష్‌ను కంటిన్యూ చేసేందుకు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగబోతున్నారు. ప్రియాంక నేతృత్వంలో 2023లో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2023లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత.. రెండు నెలల పాటు ప్రియాంక మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఇక రాహుల్ జోడో యాత్ర ముగింపు రోజునే.. ప్రియాంక పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జోడో యాత్రతో కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. దీన్ని మరింత రెట్టింపు చేసేందుకే మహిళా మార్చ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.