కాళేశ్వరం నీళ్లు 57వేల ఎకరాలకే

కాళేశ్వరం నీళ్లు 57వేల ఎకరాలకే
  • ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కథ
  • వానాకాలం పారుకాన్ని ప్రకటించిన ఇరిగేషన్​ శాఖ
  • గత వానాకాలంలో చుక్క నీళ్లియ్యలే
  • అన్ని ప్రాజెక్టుల కింద ఇప్పుడు 
  • 39.04 లక్షల ఎకరాలు టార్గెట్​ 

హైదరాబాద్‌‌, వెలుగు: బడా ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కాళేశ్వరం స్వరూపం బయటపడింది. భారీ ఖర్చు, భారీ అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నుంచి ఈ వానాకాలంలోనూ అత్తెసరు ఆయకట్టుకు కూడా నీళ్లు అందే పరిస్థితి లేదు. ఖరీఫ్​లో 57 వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు ఇవ్వనున్నట్లు ఇరిగేషన్​ విభాగం అధికారికంగా ప్రకటించింది. గత వానాకాలంలోనైతే చుక్క నీరు కూడా ఈ ప్రాజెక్టు నుంచి అందలేదు. రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు లైఫ్‌‌ లైన్‌‌ అని, దీంతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌‌ పలుమార్లు ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాత, కొత్త ఆయకట్టుతో కలిపి 36 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 85 వేల కోట్లు  ఖర్చు చేసింది. నీళ్లను లిఫ్ట్ చేసేందుకు ఇప్పటివరకు దాదాపు రూ. రెండు వేల కోట్ల కరెంటు బిల్లులు చెల్లించింది. ఇంత చేసినా.. వానాకాలంలో 57 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించటం రైతులను నిరాశకు గురి చేస్తున్నది. 

5.75 టీఎంసీలు మాత్రమే

ఈ వానాకాలం సీజన్​లో  రాష్ట్రంలోని మేజర్​, మీడియం ప్రాజెక్టుల కింద మొత్తం 39.04 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నట్లు ఇరిగేషన్​ శాఖ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు స్టేజ్​ 1, 2 కిందనే 12.29 లక్షల ఎకరాలకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బడా ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి 57 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 180 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పుకున్న ప్రభుత్వం.. 5.75 టీఎంసీలు మాత్రమే వానాకాలంలో ఆయకట్టుకు అందిస్తామని చెప్పింది. ఇటీవల జరిగిన స్టేట్​ లెవల్​ కమిటీ ఫర్​ ఇంటిగ్రేటెడ్ ​వాటర్​ ప్లానింగ్ అండ్​ మేనేజ్మెంట్(శివమ్​) కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు  తీసుకున్నారు. ఇంజనీర్ ఇన్​చీఫ్​ మురళీధర్‌‌ అధ్యక్షతన జూన్​ 23న జరిగిన ఈ మీటింగ్​ మినిట్స్​గురువారం రిలీజయ్యాయి. గత వానాకాలంలో 39.35 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించారు. అప్పటితో పోలిస్తే.. ఈ ఏడాది ఇరిగేషన్​ ప్రాజెక్టుల ఆయకట్టుకు కోత పడింది. 
కాల్వలు లేకపోవటమే సమస్య
గత మూడు సీజన్లలోనూ కాళేశ్వరం మీద రైతులు పెట్టుకున్న ఆశలు పటాపంచలయ్యాయి. 2021 యాసంగి సీజన్‌‌లో 72,337 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లివ్వాలని ప్రతిపాదించారు. చెరువుల కింద 36,499 ఎకరాలు, నేరుగా ప్రాజెక్టు నీటిని 35,838 ఎకరాలకు అందించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. కాల్వలు లేకపోవడంతో టార్గెట్​ మేరకు నీళ్లు ఇవ్వలేకపోయారు. 2021 వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి తెస్తామని ప్రతిపాదించలేదు. మొన్న యాసంగిలో 43 వేల ఎకరాలు మాత్రమే ప్రతిపాదించారు. గత యాసంగితో పోలిస్తే ఈసారి వానాకాలంలో 14,600 ఎకరాలకు మాత్రమే అదనంగా నీళ్లు ఇవ్వనున్నారు. లిఫ్ట్, పంప్​ హౌజ్​లు, రిజర్వాయర్లు నిర్మించిన ప్రభుత్వం.. పంట కాల్వల మీద దృష్టి పెట్టని పర్యవసానమే ఆయకట్టుకు నీళ్లు అందించలేకపోతుందనే అభిప్రాయాలున్నాయి.

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌‌ మధ్య 35 వేల ఎకరాలు, అనంతగిరి నుంచి కొండపోచమ్మసాగర్‌‌ మధ్య 5.76 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడా పంట కాల్వలు తవ్వలేదు. అనంతగిరి, రంగనాయకసాగర్‌‌ కింద కొంత మేరకు మాత్రమే కాల్వలు తవ్వారు. మల్లన్నసాగర్‌‌, కొండపోచమ్మ కింద పంట కాల్వల తవ్వకం ముందుకు పడలేదు. దీంతో ఈ ఎత్తిపోతల పథకం కోసం భారీగా ఖర్చు చేసినా పెద్దగా కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురాలేకపోయారు. 
ఈ వానాకాలంలో మేజర్​, మీడియం ప్రాజెక్టుల కింద 39.04 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇందులో 23.89 లక్షల ఎకరాల్లో వరి, 15.15 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేయాలని, ఇందుకోసం 365.74 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్‌‌ సాగర్‌‌ కింద 48,500 ఎకరాల వరి, 9,100 ఎకరాల ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇందుకు 5.75 టీఎంసీల నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కగట్టారు. రెండేండ్ల కింద కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌‌ - 4లో 72 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రిజర్వాయర్ల కింద పంట కాల్వలు తవ్వకపోవడంతో ఆయకట్టును 57 వేల ఎకరాలకు తగ్గించారు. మేజర్‌‌ ప్రాజెక్టుల్లో శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు కింద స్టేజ్‌‌-1, 2 కలిపి 12.29 లక్షల ఎకరాలకు ఈ వానాకాలంలో నీళ్లు ఇవ్వాలని ఇరిగేషన్​ విభాగం నిర్ణయించింది.

అత్యధికంగా వరిసాగుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కూడా ఇదే. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ కింద 6.17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. జూరాల ప్రాజెక్టుతో పాటు దాని ఆధారంగా నిర్మించిన బీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌ ఎత్తిపోతల కింద కలిపి 4.28 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. మీడియం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల్లో తాలిపేరు కింద 24 వేల ఎకరాలు, ఘన్‌‌పూర్‌‌ ఆనకట్ట  కింద 21 వేలు, సాత్నాల ప్రాజెక్టు కింద 20 వేలు, పాకాల చెరువు, వట్టివాగు కింద 18 వేల ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లు ఇవ్వనున్నారు. మేజర్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల కింద 35.69 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల కింద 3.34 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు.