లోక్​సభ ఎన్నికల తర్వాత..బీఆర్ఎస్ ఉండదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్​సభ ఎన్నికల తర్వాత..బీఆర్ఎస్ ఉండదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్​పై అసత్య ప్రచారం: మంత్రి ఉత్తమ్
  •     రాష్ట్రంలో 14  ఎంపీ సీట్లు గెలుస్తం
  •     నల్గొండలో భారీ మెజార్టీ ఖాయమని వెల్లడి

సూర్యాపేట, వెలుగు : లోక్​సభ ఎన్నికల తరువాత  బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉనికి కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్​పై బీఆర్ఎ స్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత జులైలోనే కరువు ఛాయలు మొదలయ్యాయని, రిజర్వాయర్లు అడుగంటాయని ఉత్తమ్​కుమార్​రెడ్డి చెప్పారు. 

ఎస్సారెస్పీలో గతేడాది ఇదే టైంలో 36.5 టీఎంసీలు ఉంటే.. నేడు 20 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. మల్లన్నసాగర్​లో నాడు 13 టీఎంసీలు ఉండగా.. ఇప్పుడు 7 టీఎంసీలు, లోయర్ మానేరులో అప్పుడు 12 టీఎంసీలు ఉంటే..  ఇప్పుడు 5టీఎంసీలు ఉన్నాయన్నారు. వానాకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్సే కరువుకు కారణమంటూ రాజకీయ దురుద్దేశంతో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్​ నేతలపై మంత్రి మండిపడ్డారు. కృష్ణాజలాలు తగ్గటానికి నాటి సీఎం కేసీఆరే కారణమన్నారు. 

ఏపీ సీఎం జగన్ పిలిచినప్పుడు సమావేశాలకు వెళ్లకపోవడంతో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచారన్నారు. రాష్ట్రంలో ఐకేపీ ద్వారా 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లిస్తామని మంత్రి తెలిపారు. వ్యాపారులు మద్దతు ధరకు కొనుగోలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్  14 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని, దేశంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ పార్లమెంటు స్థానం గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 6న తుక్కగూడలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

కరెంట్​పైనా అసత్య ప్రచారం

బీఆర్ఎస్ నేతలు కరెంట్ పైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్​మండిపడ్డారు. జనరేటర్ ఆన్​చేసి కరెంట్ లేదని బద్నాం చేయడం వారి దిగజారుడు తనమేనన్నారు. తాము రైతుల కోసమే పని చేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంటు డిమాండ్ పెరిగినప్పటికీ 24 గంటల విద్యుత్తు, మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. కరెంట్ సప్లై, డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేశారు. 

పదేండ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల లోపే హామీలను అమలు చేసిందన్నారు. బీఆర్ఎస్​ నేతలు  ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కే‌‌టీ‌‌ఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 
 
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదమే

 కేంద్రంలో బీజే‌‌పీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్​అన్నారు. ఇప్పటికే సిట్టింగ్ సీఎంలు,  ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడీ, ఐటీ ద్వారా అణచివేస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తుకు 2024 పార్లమెంటు ఎన్నికలు కీలకమని, బీజేపీని ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం నిలబడుతాయని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.  మతపరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందుతోందని ఆరోపించారు.