మూడేండ్ల తర్వాత మార్కెట్​లోకి కొత్త కుండలు 

మూడేండ్ల తర్వాత మార్కెట్​లోకి కొత్త కుండలు 

హైదరాబాద్, వెలుగు : మూడేండ్ల తర్వాత పూర్తిస్థాయిలో మట్టి కుండల తయారీపై కుమ్మరులు ఫోకస్ పెట్టారు. కరోనా కారణంగా ఈ వృత్తి వారు పూర్తిగా ఆదాయం కోల్పోయారు. గతేడాది కొంత మేర బిజినెస్​జరిగినప్పటికీ అంతకు ముందు తయారుచేసిన వస్తువులనే విక్రయించారు. పాత స్టాక్​ఉండడంతో చాలా మంది కొత్తవి తయారుచేయలేదు. ఈసారి పరిస్థితులు మారడం, ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతుండడంతో మట్టి పాత్రలకు బిజినెస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తుండడంతో స్టాక్​పెంచుకునేందుకు తయారీదారులు, వ్యాపారులు రెడీ అయ్యారు. వివిధ రకాల మట్టి కుండలు, గ్లాసులు, బాటిల్స్, పాత్రలు విక్రయిస్తున్నారు. ఈ నెలలో ఉగాది పండుగ ఉంది. అక్కడి నుంచి గిరాకీ ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. 

లక్ష మంది ఆధారం

గ్రేటర్​వ్యాప్తంగా కుండలు తయారుచేసే వారితో పాటు విక్రయించే వారు దాదాపు లక్షమంది వరకు ఉన్నారు. సిటీకి చెందిన వారితో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. డిమాండ్​ను బట్టి వెరైటీలు అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లుగా మార్కెట్​లోకి మట్టి వస్తువులు పెద్దగా రాలేదు. ఇప్పుడిప్పుడే అన్ని రకాల వస్తువులు వస్తుండటంతో జనం కూడా కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కంటే మట్టి కుండల రేట్లు పెరిగాయి.  ప్రస్తుతం సైజును బట్టి రూ.50 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. డిజైన్ ను బట్టి కొన్నింటిని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మట్టి గ్లాసులు రూ.25 నుంచి రూ.100 వరకు ఉంది. మట్టి మగ్​లు రూ.80 నుంచి రూ.150, మట్టి బాటిల్స్ రూ.100 నుంచి రూ.200 ఉన్నాయి.

మట్టికి ఇబ్బంది అయితాంది

మూడేండ్లుగా బిజినెస్​లేదు. కిందటేడు కూడా ఓల్డ్​స్టాక్​ చాలా ఉంది. ఈసారి ఎండలు మండిపోతుండడంతో కొత్త వస్తువుల తయారీపై దృష్టి పెట్టాం. మట్టి కుండలతోపాటు మట్టి గ్లాసులు, జగ్గులు, పాత్రలు తయారు చేస్తున్నాం. మట్టి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. సిటీలో చెరువులు ఎక్కువగా లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి మట్టిని  తెచ్చుకుంటున్నాం. కుండల తయారీ మెషీన్​ను కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. ప్రభుత్వాలు మట్టిని జల్లెడ పట్టేందుకు కూడా ఓ మెషీన్​ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం కుండలు తయారు చేసేందుకు మట్టిని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి తీసుకొస్తున్నాం. తయారీ ఖర్చు పెరిగిపోతుంది.

- కుమ్మరి ప్రభాకర్, తాళ్లగడ్డ

ఇంకా కొన్ని రకాలు రావాల్సి ఉంది

ఈ సమ్మర్ లో వ్యాపారం బాగుంటుందనే నమ్మకం ఉంది. అన్ని రకాల వెరైటీలను అందుబాటులో ఉంచాం. ఇంకా కొన్ని కొత్త రకమైన వస్తువులు రావాల్సి ఉంది. తయారీదారులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎండలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

- వెంకటేశ్వర్లు, వ్యాపారి, బంజారాహిల్స్