టారిఫ్ లపై ట్రంప్ ఎక్కడా తగ్గటం లేదు.. కెనడాపై 35 శాతం పన్ను పోటు.. నెక్స్ట్ టార్గెట్ ఇండియా ?

టారిఫ్ లపై ట్రంప్ ఎక్కడా తగ్గటం లేదు.. కెనడాపై 35 శాతం పన్ను పోటు.. నెక్స్ట్ టార్గెట్ ఇండియా ?

అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రశాంతంగా జరగనివ్వటం లేదు ట్రంప్. ప్రసిడెంట్ గా ఎన్నికైన నాటి నుంచి టారిఫ్.. టారిఫ్.. అంటూ ఇంటర్నేషనల్ ట్రేడ్ మందగించేలా చేస్తూఉన్నారు. 2025, జులై 09 డెడ్లైన్ లోపు టారిఫ్ లను ఫైనల్ చేస్తానని చెప్పిన ట్రంప్.. అప్పటి లోపు అన్నిదేశాలు యూఎస్ తో ఒప్పందాలు చేసుకోవాలని హెచ్చరించారు. లేదంటే భారీగా టారిఫ్ లు ఉంటాయని హెచ్చరించడంతో కొన్ని దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ తర్వాత డెడ్ లైన్ ను ఆగస్టు 1 తేదీకి వాయిదా వేశారు.

అయితే ఆగస్టు 1 నుంచి ఏఏ దేశాలపై ఎంత సుంకం విధిస్తారో ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బ్రెజిల్ పై ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించి బాంబు పేల్చారు. ఆ తర్వాత లేటెస్ట్ గా గురువారం (జులై 10) కెనడాపై 35 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ఈ టారిఫ్ లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కీలక విషయాల్లో కెనడా తమతో కలిసి రావటం లేదని.. అందుకే భారీ మొత్తంలో పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఫెంటనైల్ సరఫరాపై కెనడా చర్యలు తీసుకోకపోవడంపై సీరియస్ గా ఉన్నట్లు చెప్పారు ట్రంప్.

మా వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు: కెనడా ప్రధాని

ట్రంప్ 35 % టారిఫ్ లు విధించటంపై కెనడా ప్రధాని మార్క్ కేర్నీ స్పందించారు. తమ ఎగుమతులను, వ్యాపారాలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఫెంటనైల్ విషయంలో నార్త్ అమెరికాలోకి సరఫరా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అమెరికాతో ప్రస్తుతం చర్చల క్రమంలో తమ వ్యాపారాలను, కార్మికులను కాపాడుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి మారుతున్న సుంకాలకు అనుగుణంగా ట్రేడ్ ను ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. 

ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ ఇండియా..?

బ్రెజిల్, కెనడా తర్వాత యూఎస్ తదుపరి టార్గెట్ ఇండియా వంటి పెద్ద దేశాలేనని స్పష్టమవుతోంది. చిన్న దేశాలను భయపెట్టి సుంకాలు విధిస్తే.. పెద్ద దేశాలు తలొగ్గి ఒప్పందాలు చేసుకుంటాయనే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియా తమపై పెద్ద ఎత్తున పన్నులు విధిస్తోందని.. తాము కూడా రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తామని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు అదనపు సుంకాన్ని వేసేందుకు సిద్ధమయ్యారు. 

ఇండియా మంచి డీల్ కు అంగీకరిస్తుందని పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే బ్రెజిల్, కెనడా తర్వాత ఇతర దేశాలపై 15 నుంచి 20 శాతం బ్లాంకెట్ టారిఫ్ లు ఉంటాయని ప్రకటించారు ట్రంప్. దీంతో ఇండియా కూడా ఈ టారిఫ్ లిమిట్ లో ఉండవచ్చునని ఫైనాన్స్ ఎనలిస్టులు అంటున్నారు.