కనువిందు చేయబోతున్న డబుల్ డెక్కర్ బస్సులు..రూట్లు ఇవే

కనువిందు చేయబోతున్న డబుల్ డెక్కర్ బస్సులు..రూట్లు ఇవే

అప్పుడెప్పుడో భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ కనువిందు చేయబోతున్నాయి. పర్యాటకులకు ప్రయాణ మధురానుభూతిని పంచనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు హైదరాబాద్ రోడ్లపై రయ్యి మంటూ దూసుకెళ్లిన డబుల్ డెక్కర్ బస్సులు..మరోసారి రోడ్లపైకి వచ్చాయి.

ఏ ఏ రూట్లలో...

హైదరాబాద్‌ నగరవాసులకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక రూట్‌ను హెచ్‌ఎండీఏ సిద్ధం చేసింది. రూ.12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రస్తుతం కొన్ని రూట్లలో నడపనున్నారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు. ఉదయం ట్యాంక్‌ బండ్‌ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటాయి. ఛార్జింగ్‌ కోసం ఖైరతాబాద్‌ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఫ్రీ..ఆ తర్వాత...

డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగానే ప్రయాణించవచ్చు. కొన్ని రోజుల తర్వాత కనీస ఛార్జీ విధించే అవకాశం ఉందని తెలిసింది. ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేస్తారని తెలుస్తోంది. 

మరికొన్ని రూట్లలో విస్తరణ...

పర్యాటకుల స్పందనను బట్టి మరికొన్ని రూట్లలో కూడా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం 6 డబుల్ డెక్కర్ బస్సులు నడవనుండగా...వీటిని భవిష్యత్ లో 30 బస్సులకు విస్తరించాలని భావిస్తున్నారు. కొత్త డబుల్ డెక్కర్ బస్సుల్లో  65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో పాటు డ్రైవర్‌తో పాటు, ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఉంటాయి. ఇవి ఒక్కసారి ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించగలవు, పూర్తిగా రీఛార్జ్ చేయడానికి కేవలం 2-2.5 గంటల సమయం పడుతుంది.