బలపరీక్షకు ముందే కుప్పకూలిన మహావికాస్ అఘాడీ సర్కార్

బలపరీక్షకు ముందే కుప్పకూలిన మహావికాస్ అఘాడీ సర్కార్
  • బలపరీక్షకు ముందే కుప్పకూలిన మహావికాస్ అఘాడీ సర్కార్
  • అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో
  • ఆ తర్వాత కొన్ని నిమిషాలకే థాక్రే రిజైన్​.
  • సీఎంగా ఫడ్నవీస్​?డిప్యూటీ సీఎంగా షిండే!

ముంబై / న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. బలపరీక్ష నిరూపించుకోవాలంటూ ఉదయం గవర్నర్  భగత్ సింగ్ కోషియారీ.. ఉద్ధవ్​ సర్కార్​ను ఆదేశించడం, ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడం, స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో ఉద్ధవ్​ థాక్రే గద్దె దిగారు. రాజీనామాకు కొద్దిసేపు ముందు ఉద్ధవ్​ కేబినెట్​ సమావేశం నిర్వహించి.. ఔరంగాబాద్​ను  శంభాజీ నగర్​గా,  ఉస్మానాబాద్​ను ధారాశివ్​గా మార్చారు. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా పేరు పెట్టారు. 

రోజంతా టెన్షన్​..

బుధవారం ఫ్లోర్​ టెస్ట్​పై గవర్నర్​ ఆదేశాలను సవాల్​ చేస్తూ శివసేన చీఫ్​ విప్​ సునీల్​ ప్రభు దాఖలు చేసిన పిటిషన్​ పై సుప్రీం విచారణ జరిపింది. అయితే, 16 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన కేసులో సుప్రీం తీర్పును బట్టి ఫ్లోర్ టెస్ట్ రిజల్ట్ ను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. అసెంబ్లీ స్పీకర్, గవర్నర్ అధికారాలకు సంబంధించిన అంశంపై జులై 11న విచారిస్తామని పేర్కొంది. దీంతో సుప్రీంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఉద్ధవ్ థాక్రే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ప్రకటించారు. తన తండ్రి బాల్ థాక్రే ఆకాంక్ష మేరకు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చడం తృప్తిని ఇచ్చిందన్నారు. ‘‘నేను భయపడే వ్యక్తిని కాను. వీధుల్లో శివసైనికుల రక్తం చిందడం ఇష్టంలేకనే రాజీనామా చేస్తున్నా. మేం ప్రోత్సహించి, పెద్ద స్థానంలోకి తీసుకొచ్చిన వాళ్లే మమ్మల్ని మోసం చేశారు. నేను అనుకోకుండా సీఎం పదవిని చేపట్టాను. అలాగే పదవి నుంచి దిగిపోతున్నా” అని ఉద్ధవ్ చెప్పారు. తనకు నెంబర్ గేమ్ లు ఆడటంలో ఇంట్రెస్ట్ లేదన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రానివ్వాలని శివసేన కార్యకర్తలను కోరారు.  

ఆఖరి రోజు పేర్ల మార్పు 

ఒకవైపు అసెంబ్లీలో బల పరీక్షకు రంగం సిద్ధం అవుతుండగా మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే బుధవారం కేబినెట్ మీటింగ్ నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఔరంగాబాద్ పేరును మార్చాలని ఎప్పటి నుంచో శివసేన చేస్తున్న డిమాండ్ మేరకు ఆ సిటీ పేరును శంభాజీ నగర్ గా మార్చారు. అలాగే ఉస్మానాబాద్ సిటీని ధారాశివ్ గా మార్చారు. అలాగే నిర్మాణంలో ఉన్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా పేరు పెట్టారు. అయితే, పుణే సిటీకి ఛత్రపతి శివాజీ తల్లి జీజాబాయి పేరిట జీజా నగర్ గా, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ కు మాజీ సీఎం ఏఆర్ అంతులే పేరును పెట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్ ను కేబినెట్ తోసిపుచ్చింది. కాగా, రెండున్నరేండ్లుగా సహకరించిన కేబినెట్ సహచరులందరికీ ఈ సందర్భంగా ఉద్ధవ్ థ్యాంక్స్ చెప్పారని కాంగ్రెస్ మంత్రి సునీల్ కేదార్ మీడియాకు తెలిపారు. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కూడా కోరారని వెల్లడించారు.  

గవర్నర్ రఫేల్ కన్నా ఫాస్ట్: సంజయ్ రౌత్ 

సీఎం ఉద్ధవ్ థాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలంటూ ఆదేశించిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రఫేల్ ఫైటర్ జెట్ కన్నా ఫాస్ట్ గా స్పందించారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. పదహారు మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత అంశాన్ని సుప్రీంకోర్టు ఇంకా తేల్చాల్సి ఉందని, ఆ లోపే ఇలా మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడం చట్టవ్యతిరేకమన్నారు.  

మహారాష్ట్రలో వారం రోజులుగా 

సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) సర్కార్ కూలిపోయింది. ఫ్లోర్ టెస్ట్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం రాత్రి సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే థాక్రే ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. సీఎం పదవి నుంచి దిగిపోతున్నట్లు వెల్లడించారు. 

బీజేపీలో జోష్​.. 

మహారాష్ట్ర కొత్త సీఎంగా మళ్లీ బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఫడ్నవీస్ మళ్లీ సీఎం పదవి చేపడతారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక థాక్రే రాజీనామా ప్రకటన తర్వాత ఫడ్నవీస్ తో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్​ చంద్రకాంత్ పాటిల్, ఇతర నేతలు ముంబైలోని తాజ్ హోటల్ లో లెజిస్లేటివ్ మీటింగ్ కు సిద్ధమయ్యారు. తాజ్ హోటల్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

156కు పెరిగిన బీజేపీ బలం!

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా, ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంవీఏ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో సేన నుంచి 39 మంది బీజేపీతో జట్టుకట్టనున్నారు. ఇండిపెండెంట్లతో కలిపి తమ వర్గంలో 50 మంది ఉన్నట్లు షిండే చెప్తున్నారు. దీంతో బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్ (144) కంటే 12 ఎక్కువగా 156కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

వరద బాధితులకు రెబెల్స్ విరాళం

కొన్నిరోజులుగా గౌహతిలోని ఓ హోటల్ లో క్యాంపు పెట్టిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అక్కడి వరద బాధితుల కోసం రూ. 51 లక్షల విరాళం ప్రకటించారు. ఒకవైపు అస్సాం వరదలతో అతలాకుతలం అయిపోతుంటే.. సేన ఎమ్మెల్యేలు లగ్జరీ హోటల్ లో ఖుషీగా గడుపుతున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ప్రజల బాధలను తాము విస్మరించలేదని, వరద బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు రెబెల్స్ తెలిపారు.