
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రికి రిపేర్ చేసినా ఆశించిన స్థాయిలో అందుబాటులోకి తేవడం కష్టమని నిపుణుల కమిటీ తేల్చినట్లు హైకోర్టుకు ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. ఆస్పత్రిపై దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రిపై వేసిన కమిటీ రిపోర్టు ఏంటి, దాని ఆధారంగా తీసుకోనున్న చర్యలేమిటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. రిపేర్లు, మరమ్మతులు చేసినా ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ సేఫ్ గా ఉండదని కమిటీ రిపోర్టు ఇచ్చిందని ఏజీ తెలిపారు. రిపోర్టును ప్రభుత్వం స్టడీ చేయాల్సి ఉందని, దానిపై నిర్ణయం తెలియజేసేందుకు గడువు కావాలని కోర్టును కోరారు. పర్మిషన్ ఇచ్చిన కోర్టు విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.