శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ

శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ

శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరోసారి ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇటీవల ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా... మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే ఆదేశాలు జారీ చేశారు. 

దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు  విక్రమ సింఘే తెలిపారు.1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్‌(చాప్టర్‌ 40)లోని సెక్షన్‌ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఇటీవల శ్రీలంక మహింద యాపా అబేవర్దన ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో జులై 19న అధ్యక్ష ఎన్నిక ఉండబోతుందంటూ వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నేటి (జులై 18) నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి.