తొమ్మిదో రోజుకు బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల దీక్ష

 తొమ్మిదో రోజుకు బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల దీక్ష
  •     తొమ్మిదో రోజుకు బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల దీక్ష
  •      మోకాళ్లపై కూర్చుని నిరసన 

యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమయ్యే భూముల కోసం నిర్వాసితులను అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. భూములను తీసుకున్నాక ఆగం చేస్తోందని లప్పనాయక్ తండా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం తీరాక తీసుకున్న భూములకు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రిజర్వాయర్ కింద యాదాద్రి భువనగిరి జిల్లా లప్పనాయక్ తండా గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారంతో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం నిర్వాసితులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రిజర్వాయర్ కోసం భూములిచ్చేవరకు నమ్మకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆఫీసర్లు.. తీరా భూములు అప్పగించాక నిర్వాసితుల గోడు వినడానికి కూడా టైమిస్తలేరని ఆరోపించారు. నష్టపరిహారం, పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఆఫీసర్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం తీసుకున్న భూముల్లో దాదాపు 200 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం ఇంకా నిర్వాసితులకు అందలేదన్నారు.

నిర్వాసితులకు పునరావాసం కోసం దాతరుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 294లో అన్నిరకాల సదుపాయాలతో లేఅవుట్ చేసి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, ఇళ్ల నిర్మాణం కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఆ దిశగా పనులే మొదలు కాలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకటనలకే పరిమితమయ్యాయే తప్ప క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిహారం, పునరావాసం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనావత్ బుజ్జి శంకర్ నాయక్, మాజీ సర్పంచ్ గాశీరాం, ఉప సర్పంచ్ మంక్యా నాయక్, నిర్వాసితులు పాల్గొన్నారు.