సికింద్రాబాద్ ఘటనలో ఒకరు మృతి

సికింద్రాబాద్ ఘటనలో ఒకరు మృతి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీం.. దేశంలో పలు ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం ప్రకటించిన ఈ పథకంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో పలు దాడులకు పాల్పడుతూ ఇప్పటికే దేశంలోని పలు చోట్ల నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కాగా తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ రణరంగాన్ని తలపించేలా రైలు బోగీలకు నిప్పు పెట్టి.. పలు రైళ్లను బూడిద చేశారు. అగ్ని పథ్ స్కీంను రద్దు చేయాలని, తిరిగి పరీక్షను నిర్వహించాలని నిరసన తెలుపుతున్న అభ్యర్థులు సృష్టించిన దాడులకు.. రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న ఆందోళన కారులను చేసేదేం లేక.. చివరికి పోలీసులు వారిపైకి భాష్ప వాయువు కూడా ప్రయోగించారు. అంతే కాదు నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది ఆందోళనకారులు గాయపడ్డట్టు తెలుస్తోంది. దీంతో వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉండగా.... ఛాతీలో బుల్లెట్ దిగిన ఒక వ్యక్తి మాత్రం చనిపోయినట్లు గాంధీ వైద్యులు ధృవీకరించారు.