అగ్రిగోల్డ్ బాధితులకు రూ.886 కోట్లు

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.886 కోట్లు
  • జీవో విడుదల చేసిన ఏపీ సర్కారు
  • రూ.20 వేల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు

అమరావతి, వెలుగు: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ సర్కారు రూ.886 కోట్లు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడతలో 10 వేల లోపు డిపాజిటర్లు 3.70 లక్షల మందికి రూ. 264 కోట్లు చెల్లించింది. రెండో విడతలో రూ.20 వేల లోపు డిపాజిటర్లు చెల్లింపులు చేయనున్నారు.

వైఎస్ జగన్ సర్కారు నిర్ణయంతో తమ జీవితాల్లో ఒకరోజు ముందే దీపావళి వచ్చిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిపాజిట్ డబ్బు ఎప్పటికి తిరిగి రాదనుకున్న సమయంలో సీఎం జగన్‌‌‌‌‌‌‌‌ నమ్మకం నింపారన్నారు. కోర్టు కేసులు పూర్తి కాగానే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయంలో భాగంగా 3, 4వ విడతల్లో రూ. 50 వేలు, రూ.లక్ష లోపు డిపాజిటర్లకు న్యాయం చేస్తుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సర్కారు రూ. 1,157 కోట్లు  కేటాయించినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అప్పటి సీఎం  చంద్రబాబును  కోరితే అరెస్టులు చేయించారని, ఆయన నిర్వాకం వల్ల 300 మంది బాధితులు చనిపోయారని ఆరోపించారు.ఈ నెల 29న  అగ్రిగోల్డ్ బాధిత సంఘాలతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు.