ఉపాధి హామీ ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు : వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ఉపాధి హామీ ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు : వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
  •     వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు 
  •     ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా

వంగూర్, వెలుగు : ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏకపక్షంగా సవరిస్తూ తీసుకువచ్చిన కొత్త విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వంగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, మండల కార్యదర్శి బి. బాలస్వామి మాట్లాడారు.

వామపక్షాల పోరాటంతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, బడ్జెట్‌లో నిధులను భారీగా తగ్గించి కూలీల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. కొత్త చట్టం వల్ల కూలీలకు భద్రత కరువైందని, హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 200 పనిదినాలు కల్పించాలని, రోజువారీ కూలీని రూ. 600కి పెంచాలని, ప్రమాదవశాత్తు మరణించిన కూలీల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ చట్టాన్ని కుదించడం వల్ల గ్రామీణ ప్రజలు మళ్లీ వలసల బాట పట్టే ప్రమాదం ఉందని, కొత్త మార్పులను రద్దు చేసే వరకు గ్రామగ్రామాన కూలీలను చైతన్య పరిచి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్, వెంకటయ్య, మల్లయ్య, సైదులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.