దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినయ్‌

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినయ్‌

ఎల్బీనగర్, వెలుగు: దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలోనూ మనం విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రీడ)లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రైతులతో పాటు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రధాని మీటింగ్ అయిపోయిన తర్వాత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు మనం పాల ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు అదే దేశానికి ఎగుమతి చేసే స్థాయికి చేరామన్నారు. దేశంలోని 10 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఒకేసారి రూ.21 వేల కోట్లను రైతుల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత 8 ఏండ్లుగా ప్రధాన మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పని చేస్తున్నారని, కానీ మన సీఎం కేసీఆర్‌‌ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్‌హౌస్ నుంచే పాలన సాగిస్తున్నారని అన్నారు. కాగా, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయనీయకుండా సీఎం కేసీఆర్‌‌ అడ్డుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ పథకం కింద పేద ప్రజలకు రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్‌ను ఏ రాష్ట్రంలోనైనా తీసుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని తెచ్చిందని చెప్పారు. రామగుండం ఫ్యాక్టరీని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.