లేటెస్ట్ టెక్నాలజీతో వ్యవసాయ విప్లవం.. ఇజ్రాయెల్, జర్మనీ మోడల్స్ అమలుకు సర్కారు సన్నాహాలు

లేటెస్ట్ టెక్నాలజీతో వ్యవసాయ విప్లవం.. ఇజ్రాయెల్, జర్మనీ మోడల్స్ అమలుకు సర్కారు సన్నాహాలు
  • లేటెస్ట్​ టెక్నాలజీ వాడేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు
  • పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్​ రకాల సాగుకు ప్రోత్సాహం
  • అధిక దిగుబడులు సాధించేందుకు యత్నాలు 

హైదరాబాద్, వెలుగు: 
వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. జపాన్, ఇజ్రాయెల్, థాయ్‌‌లాండ్, జర్మనీ, మలేషియా, చైనా, అమెరికా, యూరప్  దేశాల్లో విజయవంతమైన వ్యవసాయ పద్ధతులను రాష్ట్రంలో అనుసరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సంప్రదాయ సాగు పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఉత్పాదకతను పెంచి, ఉత్పత్తి ఖర్చులను తగ్గించి, రైతులకు ఎక్కువ లాభాలు అందించాలని యోచిస్తోంది. 

ఈ దిశగా 2025లో ఇజ్రాయెల్‌‌తో ప్రత్యేక సహకారం పొందేందుకు ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటోంది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గదర్శకత్వంలో రాష్ట్ర శాఖ, ఇజ్రాయెల్  సాంకేతికతను కూరగాయలు, పండ్లు, పూలతోటల సాగులో అమలు చేయనుంది. ఇజ్రాయెల్  సంస్థల సహకారంతో ఆటోమేషన్, సెన్సార్  టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), కచ్చితమైన సాగు విధానం, భూగర్భ జలాల శుద్ధీకరణ వంటి సాంకేతికతలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. 

ఈ ప్రాజెక్టులకు విద్యా సంస్థలతో కలిసి పైలట్  కార్యక్రమాలు చేపడుతూ, రైతులకు శిక్షణ కల్పిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. మెక్రో ఇరిగేషన్, పాలీహౌస్‌‌ల ఏర్పాటులో ఇజ్రాయెల్  విధానాలను వినియోగిస్తున్నారు. విత్తన తయారీలో జర్మనీ సాంకేతికతను వాడుతూ, జీడిమెట్ల పరిశోధన కేంద్రంలో స్థానిక కూరగాయలు, ఆకుకూరల సాగుకు నూతన పద్ధతులపై టెస్టింగ్​ నిర్వహిస్తున్నారు. ములుగు హార్టికల్చర్  విశ్వవిద్యాలయంలో ఆధునిక విధానాల అమలులోపై అధ్యయనాలు జరుగుతున్నాయి. 

సెంటర్  ఆఫ్ ఎక్సెలెన్సీలతో పరిశోధన పునాదులు

రాష్ట్రంలో హైదరాబాద్​లోని జీడిమెట్ల, ములుగు హార్టికల్చర్  వర్సిటీ ప్రాంగణాల్లో సెంటర్​ ఆఫ్​ ఎక్సెలెన్స్  ఏర్పాటు చేసి, ఇజ్రాయెల్  సాంకేతికత అమలు చేస్తున్నారు. ములుగులో జర్మనీ సహకారంతో ప్రత్యేక పరిశోధనశాలను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ పరిశోధనశాలలో నేలల సారం, పంటల్లో రసాయన అవశేషాలు, ఎక్స్​పోర్ట్​  క్లియరెన్స్ కోసం నాణ్యతా పరీక్షలు చేసే అవకాశం ఉంది. 2025 మేలో ప్రకటించినట్లుగా ఇజ్రాయెల్, -జపాన్  రోబోటిక్  రైతు సాంకేతికతను భారతీయ వ్యవసాయంలో పరీక్షిస్తున్నారు.

 ఫుడ్  ప్రాసెసింగ్‌‌లో ఆధునిక మలుపు

ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే వాడిన జర్మనీ, ఇజ్రాయెల్  టెక్నాలజీని ఫుడ్​ ప్రాసెసింగ్  రంగానికీ విస్తరిస్తున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వేరుసెనగ దిగుబడి ఎక్కువగా ఉన్నందున స్వయం సహాయక సంఘాల ద్వారా వేరుసెనగ నుంచి నూనె తీసే కేంద్రాలు, పల్లీపట్టీ, చాక్లెట్‌‌లు, గుజ్జు తయారీలో లేటెస్ట్​ టెక్నాలజీని వాడనున్నారు. 

అదేవిధంగా మహబూబాబాద్‌‌లో మిర్చి ప్రాసెసింగ్  యూనిట్  ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పండ్ల ప్రాసెసింగ్‌‌కు జర్మనీ సాంకేతికతను అనుసరించి జ్యూస్, పల్ప్ ప్యాకేజింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రతీ పంటను ప్యాకేజ్డ్  రూపంలో మార్కెటింగ్  చేసే లక్ష్యంతో అగ్రికల్చర్, హార్టికల్చర్​ శాఖలు అధ్యయనం చేస్తున్నాయి.

ఫర్టిగేషన్‌‌తో నీటి, పోషకాల నిర్వహణ

పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఇజ్రాయెల్  ఫర్టిగేషన్  పద్ధతిని అమలు చేస్తున్నారు. డ్రిప్  సాగునీటి ద్వారా నీరు, పోషకాలు మొక్కలకు నేరుగా అందించడంతో రసాయనాలు పర్యావరణాన్ని ప్రభావితం చేయవు. ఇజ్రాయెల్‌‌లో 75 శాతం సాగు విస్తీర్ణం సూక్ష్మసాగునీటి పద్ధతిలో, 81 శాతం ఫర్టిగేషన్‌‌  విధానంలో జరుగుతుంది. రాష్ట్రంలో డ్రిప్  ఇరిగేషన్, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు వివిధ నేలలు, వాతావరణాల్లో ఈ పద్ధతిని విస్తరించనున్నారు.