అన్నిటికంటే సంతృప్తినిచ్చేది రైతు ఉద్యోగమే : తుమ్మల నాగేశ్వరరావు

అన్నిటికంటే సంతృప్తినిచ్చేది  రైతు ఉద్యోగమే : తుమ్మల నాగేశ్వరరావు

తల్లాడ, వెలుగు : దేశంలో అన్ని ఉద్యోగాల కంటే సంతృప్తినిచ్చేది రైతు ఉద్యోగమేనని  వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. తల్లాడ మండలం అన్నారుగూడెం పరిధిలో చావా శ్రీనివాసరావు రైతుల కోసం నిర్మించిన భద్రాద్రి కోల్డ్ స్టోరేజ్ ను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతులు కొత్త పంటలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. 

గోదావరి నీళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు. జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఖమ్మం, దేవరపల్లి రహదారి ఈ సంవత్సరంలోనే పూర్తవుతుందని చెప్పారు. సూర్యాపేట, కోదాడ ప్రాంతాలలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్న గాడ్రెజ్ కంపెనీ ఇక్కడే పామాయిల్ విత్తనం తయారు చేసేలా ప్లాన్​ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రంపై హర్యానా, పంజాబ్ రైతులు చేస్తున్న నిరసనలకు తెలంగాణ రైతాంగం సంఘీభావం తెలుపాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తన క్షేత్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యూనియన్ బ్యాంక్ డీజీఎం హనుమంత్ రెడ్డి, అన్నారుగూడెం మాజీ సర్పంచ్ మారెళ్ల మమత, పలు ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు, కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు. 

ప్రజల గౌరవాన్ని కాపాడేలా పని చేస్తా

ఖమ్మం టౌన్ :  ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పని చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో స్వలాభం కోసం రాజకీయాలు చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎవరి బెదిరింపులకు లొంగకుండా నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారన్నారు.  

అంతకుముందు బీఆర్ఎస్ కు చెందిన 21, 39, 44, 50వ డివిజన్ కార్పొరేటర్లు ఆళ్ల నిరీషా రెడ్డి, మడూరి ప్రసాద్, పాలేపు విజయ, రాపర్తి శరత్ మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అందజేశారు. సమావేశంలో సిటీ అధ్యక్షుడు జావీద్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, సాధు రమేశ్​రెడ్డి, కార్పొరేటర్​ ఎల్.సైదులు పాల్గొన్నారు.