రెండు రోజుల్లో 2,200 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

రెండు రోజుల్లో 2,200 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలతో నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్​కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక రిపోర్టులు అందాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు తెలిపారు. మొత్తం 2,200 ఎకరాల్లో వరి, మక్కజొన్న, ఉద్యానపంటలకు నష్టం వాటిల్లినట్టు శనివారం ఓ ప్రకటనలో వివరించారు. పంటనష్టం జరిగిన ప్రాంతాలను వెంటనే పరిశీలించి పూర్తిస్థాయి వివరాలను వెంటనే సేకరించాల్సిందిగా  అధికారులను ఆయన ఆదేశించారు. 

వరి కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని, అకాల వర్షాలతో కలిగే పంటనష్టాన్ని తగ్గించే విధంగా ముందస్తు జాగ్రత్తలపై రైతులకు సూచించాలని చెప్పారు. కలెక్టర్​ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. మార్కెట్లకు/సెంటర్లకు వచ్చిన వడ్లు, ఇతర పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  రైతుల కోసం ఇప్పటికే 2 లక్షలకుపైగా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచినట్టు మంత్రి పేర్కొన్నారు.