కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా డిగ్రీ కాలేజీ భూముల విషయంలో తమ కుటుంబం ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం చేయలేదని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లిన ఆయన, కాలేజీ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు.
కాలేజీ భూముల్లో నుంచి ఏ సంస్థలకు ఎంత మేర కేటాయించారో వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భూములు అన్యాక్రాంతం అయ్యాయా లేదా అన్నది తేల్చాల్సింది ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్సేనని అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
డిగ్రీ కాలేజీ భూముల్లో తమ కుటుంబం గజం భూమి ఆక్రమించినట్లు నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కలెక్టరేట్‌కు వస్తానని ముందస్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
