అణగారిన వర్గాలకు ప్రత్యేక పథకాలు..ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అణగారిన వర్గాలకు ప్రత్యేక పథకాలు..ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

మహబూబాబాద్, వెలుగు: అణగారిన వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పరిశీలనకు ఆయన వచ్చారు. ఇల్లందు రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద ప్రజల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలను త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలోని 17వ డివిజన్ ఇల్లందు రోడ్డు ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, ఎస్సీ, ఎస్టీ కమిషన్​ అధికారులు శ్రీనివాసరావు, దేశీరామ్ నాయక్, తహసీల్దార్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.