బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోఠి(హైదరాబాద్) ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు జాగ్రత్తగా భారీగా మోహరించిన పోలీసులు ధర్నాకు వచ్చిన ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, పోలీసుల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పలువురు ఆశా వర్కర్లు గాయపడగా, కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.
ఆశా వర్కర్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలను యథావిధిగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.18 వేల వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సమస్యలు వినిపించేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. నీలా దేవి, రాష్ట్ర కోశాధికారి పి. గంగమణి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు మీనా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
