నాణ్యత పేరిట కర్రీలు.. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతుల ఆందోళన

నాణ్యత పేరిట కర్రీలు.. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతుల ఆందోళన

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: పత్తి కొనుగోలులో నాణ్యత పేరుతో అధికారులు నానా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపించారు. ఆదిలాబాద్​ మార్కెట్​ యార్డులో సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం పత్తి రైతులు ఆందోళనకు దిగారు.

మార్కెట్​ యార్డులో బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్​పర్సన్​ సుహాసినిరెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. రైతులు కిసాన్​ యాప్​లో స్లాట్​ బుక్​ చేసుకుని వచ్చినా నాణ్యత లేదనే నెపంతో అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పత్తి బాగున్నా పాసింగ్​ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎంపీ గోడం నగేశ్‌‌కు ఫోన్ చేసి సమస్య వివరించగా అధికారులు కొనుగోళ్లు ప్రారంభించారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు ధర్నా విరమించారు. రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.