మా గోల్డ్ మాకిచ్చేయండి..    చెన్నూర్ ఎస్‌‌బీఐ వద్ద గోల్డ్ స్కామ్ బాధితుల ఆందోళన

మా గోల్డ్ మాకిచ్చేయండి..    చెన్నూర్ ఎస్‌‌బీఐ వద్ద గోల్డ్ స్కామ్ బాధితుల ఆందోళన

చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌లోని ఎస్‌‌బీఐ బ్రాంచ్–2 గోల్డ్ స్కామ్ బాధితులు సోమవారం బ్యాంక్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత ఏడాది ఆగస్టులో బ్రాంచ్ మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ రవీందర్ కస్టమర్లు కుదవబెట్టిన సుమారు 20 కిలోల బంగారాన్ని మాయం చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల విచారణలో నిందితులను గుర్తించి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని రికవరీ చేశారు. ఆ గోల్డ్‌‌ను కోర్టులో డిపాజిట్ చేసి నిందితులను జైలుకు పంపారు. రికవరీ చేసిన బంగారాన్ని త్వరలోనే కస్టమర్లకు అందజేస్తామని బ్యాంక్ అధికారులు ఏడు నెలల క్రితం హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు.

అయితే ఇప్పటివరకు గోల్డ్‌‌ను ఇవ్వకపోగా, కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు తమ అవసరాల కోసం బంగారాన్ని కుదవబెట్టి లోన్లు తీసుకున్నారని, సిబిల్ స్కోర్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అప్పు చేసి గోల్డ్ లోన్‌‌ను వడ్డీతో సహా తీర్చామని పేర్కొన్నారు.

అయినప్పటికీ బ్యాంక్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తమకు నమ్మకం పోయిందని అన్నారు. త్వరగా తమ బంగారం అప్పగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన బ్యాంక్ అధికారులు త్వరలో రీజనల్ మేనేజర్ వస్తారని, కోర్టులో ఉన్న బంగారాన్ని కస్టమర్లకు చూపించి త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు, బ్యాంక్ అధికారుల విజ్ఞప్తితో బాధితులు ఆందోళన విరమించారు.