పత్తి కొనుగోళ్లకు రెడీ కావాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

పత్తి కొనుగోళ్లకు రెడీ కావాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హాకా భవన్‌లో పత్తి కొనుగోళ్లపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, వాతావరణ పరిస్థితుల కారణంగా సగటు దిగుబడి తగ్గినా, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో మంచి ధర లభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం క్వింటాల్‌ పత్తి ధర రూ.8వేలు ఉందని, అయినప్పటికీ రైతులకు మద్దతుధర రూ.6,380 పైగా లభించేలా మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

మిల్లు యజమానులు భాగస్వాములవ్వాలి

పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లుల యజమానులు పూర్తి భాగస్వాములు కావాలని నిరంజన్​రెడ్డి అన్నారు. ఇప్పటికే 313 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించామని, 121 వ్యవసాయ మార్కెట్ యార్డులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ప్రతిపాదించినట్లు చెప్పారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్ శాఖ వెంటనే నియమించుకోవాలన్నారు. వారానికి ఆరు రోజులు పని చేసేలా సీసీఐ మేనేజర్లు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కొనుగోళ్ల పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.