హైదరాబాద్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మలి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల్లో మలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 3వేల 752 గ్రామ పంచాయతీలకు, 28 వేల 406 వార్డులకు 17వ తేదీన పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. 4 వేల 157 గ్రామాలకు, 36 వేల 434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 గ్రామాలు,7 వేల 916 వార్డులు ఏకగ్రీవం కావడం గమనార్హం. 11 గ్రామాలకు,112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 3 వేల 752 గ్రామ పంచాయతీల్లో 12 వేల 640 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగిన సంగతి తెలిసిందే. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ.. రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగించింది.
అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. ఈ విడతలో మొత్తం 4,331 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల రెండు పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డుమెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా.. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 4,331 గ్రామ పంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 2,316 స్థానాలను కైవసం చేసుకొని.. తన ఆధిపత్యాన్ని చాటుకున్నది. బీఆర్ఎస్ పార్టీ 1,157 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 256, ఇతరులు 481(ఇందులో సీపీఐ, సీపీఎం ఉన్నాయి) స్థానాలు సాధించారు.
కాగా, జగిత్యాల జిల్లాలో మొత్తం 144 స్థానాలు ఉండగా.. అత్యధికంగా కాంగ్రెస్ 103 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ కేవలం 15 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. అక్కడ ఉన్న 282 స్థానాల్లో 172 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 65 సీట్లతోనే సరిపెట్టుకున్నది.
