- 10 నెలల్లో రైతులకు రూ.27 వేల కోట్లు అందించాం: తుమ్మల
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను ఎగ్గొట్టి తమ ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గుమాలిన చర్య అని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలాతీసి అప్పుల కుప్పగా మార్చినా రైతుబంధు పథకం కింద రూ.7,666 కోట్లు చెల్లించామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ చెల్లించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేస్తే, ఆ బాకీలు చెల్లించి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టం సంభవించినా పరిహారం సంగతి అటుంచి కనీసం రైతులను కూడా బీఆర్ఎస్ నేతలు పరామర్శించలేదని ఫైర్ అయ్యారు.
తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రెండు విడతలు, నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం చెల్లించామని చెప్పారు. అలాగే వడగళ్ల వానలకు మార్చిలో రూ.15 కోట్లు, ఆగస్టు వరదలకు రూ.79 కోట్లు రైతులకు చెల్లించామని వెల్లడించారు.