సత్తుపల్లిని సుందరంగా తీర్చిదిద్దాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సత్తుపల్లిని సుందరంగా తీర్చిదిద్దాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

సత్తుపల్లి, వెలుగు :  సత్తుపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అన్నారు. గురువారం సత్తుపల్లి పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నా.. లేకున్నా సత్తుపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని, ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక ప్రతిష్ట ఉందని, దానిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

 తాను జలగం వెంగళరావును చూసి రాజకీయాల్లోకి వచ్చానని, సత్తుపల్లి తనకు రాజకీయ జన్మను ఇచ్చిందని గుర్తుచేశారు. కరువుతో ఉండే వేంసూర్ మండలానికి గోదావరి నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేసి చూపించమన్నారు. పులిగుండాల ప్రాజెక్ట్ ఎకో టూరిజంగా అభివృద్ధి చెందుతుందని, పర్యాటకులు వచ్చేలా కృషి చేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. సింగరేణి వల్ల పర్యావరణ సమస్యలు ఉన్నాయని, కిష్టారం గ్రామ ప్రజలు నష్టపోతున్నారని, వారితో మాట్లాడి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.

 అడవులలో జామయిల్ పెంపకం తగ్గించి, జాతి మొక్కలను పెంచి పర్యావరణం కాపాడాలని సూచించారు. గతంలో తాను అడవులు నరకొద్దు అంటే ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ ఓ విక్రమ్ సింగ్ జైన్, సీసీఎఫ్ భీమానాయక్, ఎఫ్ డీఓ మంజుల,  ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్, భాగం నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మల బిజీబిజీ 

అశ్వారావుపేట/దమ్మపేట : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం గండుగులపల్లిలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో గురువారం బిజీబిజీగా గడిపారు. సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసేందుకు రావటంతో ఆయన నివాసం కిక్కిరిసిపోయింది. దసరా పండుగను పురస్కరించుకొని కొందరు నాయకులు, మండలాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ మరికొందరు కార్యకర్తలు ఆయన దృష్టికి తెచ్చారు.