వైరా, వెలుగు : ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సీతారామ ప్రాజెక్ట్ మూడు పంపు హౌస్ లు ప్రారంభించి గోదావరి జలాలను రైతులకు అంకితం చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. వైరా నియోజకవర్గ కేంద్రంలోని శాంతినగర్ వద్ద ఏర్పాటుచేసిన వ్యవసాయ రైతు సదస్సు, సీఎం సభా వేదిక పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కృష్ణా జలాలకు గోదావరి జలాలు అనుసంధానం చేయడంతో లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు.
40 ఏండ్లుగా తాను ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నానని, ఈ ప్రాంతం రైతులు, ప్రజల కష్టాలు తనకు తెలుసు అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏండ్ల పాటు రైతులు తీవ్రంగా నష్టపోయారని, సీతారామ ప్రాజెక్టు నిధులు ఖర్చు చేశారు కానీ చుక్క నీరు కూడా రైతులు అందించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లు నిర్మించామని తెలిపారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తామని, ఇది ప్రపంచ చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ప్రవేశపెడుతన్న పథకాలను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు.