- వ్యవసాయ యాంత్రీకరణ కింద జిల్లాకు రూ.4.61 కోట్లు మంజూరు
- బిల్ పాస్ చేయాలంటే 10 నుండి 15 శాతం కమీషన్లు
సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన యాంత్రీకరణ పథకంలో డీఏవోలు, ఏడీలు, ఏవోలు కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కీమ్ కింద రైతులకు ప్రభుత్వం రాయితీ తో యంత్రాలను ఇస్తుండగా బిల్లుల కోసం అగ్రికల్చర్ ఆఫీసర్లు పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో అధికారికి స్థాయిని బట్టి, పరికరాన్ని బట్టి రూ. 5వేల నుంచి రూ. 30వేల వరకు కమీషన్లు వసూలు చేస్తుండగా తాజాగా డీలర్ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తో పర్సంటేజ్ పై మొర పెట్టుకున్న ఆడియో వైరల్ గా మారడంతో ఆఫీసర్ల తీరు బయటపడింది.
- రాయితీ కింద వ్యవసాయ యంత్రాలు
సబ్- మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) స్కీమ్ కింద చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం అందిస్తోంది. 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 40శాతం సబ్సిడీ, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళా రైతులకు 50 శాతం రాయితీ కింద వ్యవసాయ యంత్రాలను అందిస్తారు. రూ. లక్ష కంటే తక్కువ ఉన్న వ్యవసాయ యంత్రాల కోసం రైతులు ధరఖాస్తు చేసుకుంటే మండల కమిటీ అప్రూవల్ ఇస్తే.. రైతు డీడీ తీసి ఆన్ లైన్ లో నమోదు చేయాలి.
దాన్ని ఏడీఏ అప్రూవల్ చేసి డీఏవో కు ఫార్వర్డ్ చేస్తారు. డీఏవో అప్రూవల్ చేసి ప్రొసీడింగ్ రైతుకు అందిస్తే.. ఆ ప్రొసీడింగ్ కాపీని మరోసారి ఆన్ లైన్ చేస్తే డీలర్ రైతులు కావాల్సిన వ్యవసాయ యంత్రాలను అందిస్తారు. రూ. లక్ష కంటే ఎక్కువ రేటు ఉన్నయంత్రాలను జిల్లా కమిటీ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం సూర్యాపేట జిల్లాకు 852 వ్యవసాయ యంత్రాలకు రూ. 4.61 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
- 10 నుంచి 15 శాతం పర్సెంటేజ్
సబ్సిడీ కింద అందించే వ్యవసాయ యంత్రాల బిల్లుల కోసం ఆగికల్చర్ ఆఫీసర్లు 10 నుంది 15 శాతం పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారు. రాయితీ పై అందించే వ్యవసాయ యంత్రాలను రైతులు సబ్సిడీ అమౌంట్ మినహాయించి మిగిలిన అమౌంట్ డీలర్ కు చెల్లించాలి. రైతులు యంత్రాలను తీసుకున్న అనంతరం డీలర్ యూసీలను అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందిస్తే ఆన్ లైన్ చేసి బిల్లులను ట్రెజరీకి పంపిస్తారు. అయితే బిల్లులను ఆన్ లైన్ చేసేందుకు అగ్రికల్చర్ ఆఫీసర్ 10 శాతం, ఏడిఏలు మరో 10 శాతం పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారు.
దీంతో డీలర్లు ఆగికల్చర్ ఆఫీసర్లకు పర్సంటేజ్ ఇవ్వలేని పరిస్తితి నెలకొనగా, అంతా పర్సెంటేజీ ఆఫీసర్లకు ఇస్తే ఏమి మిగిలేది లేదని డీలర్లు వాపోతున్నారు. ఈ నేపద్యంలో పర్సెంటేజీ లను ఇవ్వలేక బిల్లులు కోసం డీలర్లు ముందుకు రాలేని పరిస్తితి నెలకొంది. ఇప్పటి వరకు రూ.4 కోట్ల వరకు రైతులు వ్యవసాయ యంత్రాలను బుక్ చేసుకుంటే ఆన్ లైన్ లో యూసీలను మాత్రం రూ.20 లక్షలు మాత్రమే అప్ లోడ్ చేయడం గమనార్హం. ఈ నెల 31వరకు యుసీలను ఆన్ లైన్ లో నమోదు చేయకుంటే వచ్చిన బిల్లులు వెనక్కు వెళ్ళే పరిస్థితి ఉంది.
- చర్యలు తీసుకుంటాం
బిల్లుల కోసం పర్సంటేజీ వసూళ్లు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తి ఎంక్వైరీ చేసి ఇలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీధర్ రెడ్డి,
అగ్రికల్చర్ ఆఫీసర్, సూర్యాపేట జిల్లా
