ఏటా రూ.వెయ్యి కోట్ల నకిలీ సీడ్స్‌‌ దందా

ఏటా రూ.వెయ్యి కోట్ల నకిలీ సీడ్స్‌‌ దందా

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రం నకిలీ విత్తనాలకు కేరాఫ్​అడ్రస్ గా మారింది. తెలంగాణను సీడ్ బౌల్ గా మారుస్తున్నామని, విదేశాలకు విత్తనాలు కూడా ఎగుమతి చేస్తున్నామని ప్రకటించుకుంటున్న సర్కార్ పెద్దలు.. రైతులకు నాణ్యమైన సీడ్స్ అందేలా చూడటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. సీజన్ రాకముందే నకిలీ విత్తనాల సప్లై మొదలుపెడ్తున్న అక్రమార్కులు.. సీజన్ టైంలో విచ్చలవిడిగా మార్కెట్లోకి నకిలీ విత్తనాలను తెస్తున్నరు. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్​సీజన్ లో సీడ్ మాఫియా ఏకంగా రూ. 1000 కోట్ల దందా చేస్తోందని వ్యవసాయ శాఖ అధికారులే చెప్తున్నరు. కేవలం 20 రోజుల్లోనే రూ. 100 కోట్ల విలువైన 24 వేల క్వింటాళ్ల అక్రమ విత్తనాలు పట్టుబడ్డాయని సర్కార్ కు వ్యవసాయ శాఖ తాజాగా ఇచ్చిన రిపోర్టే ఇందుకు సాక్ష్యమని అంటున్నరు. గురువారం ఒక్కరోజే సూర్యాపేట జిల్లాలో రూ.13.5 కోట్ల విలువ చేసే నకిలీ సీడ్స్​పట్టుకున్నరు. ఇలా ప్రతి రోజు సగటున రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు అక్రమ సీడ్స్ పట్టుబడుతున్నయి. అధికారులకు పట్టుబడకుండా చేస్తున్న దందా ఇంకా పెద్ద మొత్తంలోనే ఉంటుందని పేర్కొంటున్నరు. 

టాస్క్ ఫోర్స్ ఉన్నా.. దందా ఆగుతలే 

రాష్ట్రంలో నకిలీ విత్తన దందాను అడ్డుకునేందుకు పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తున్నా, నకిలీల బెడద పోవడం లేదు. ఎక్కడికక్కడ రూ. కోట్ల నకిలీ సీడ్స్ పట్టుబడుతూనే ఉన్నయి. విత్తన చట్టంలోని లూప్ హోల్స్, నేతల అండదండలు, అధికారుల సహకారంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నరన్న విమర్శలు వస్తున్నయి. ఈ సీజన్​లో సాగయ్యే పత్తి, సోయాబీన్​, మొక్కజొన్న, మిర్చి పంటలకు సంబంధించిన నాసిరకపు విత్తనాలు మార్కెట్​లో ఎక్కువగా సప్లై అవుతున్నయి. వీటిలో ప్రధానంగా పత్తి విత్తనాలే 90 శాతం ఉంటాయని ఇటీవలి టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో అంచనాకు 
వచ్చారు. 

సాగు పెంచాలన్నరు.. సీడ్స్ ఇయ్యలే 

ఈ ఖరీఫ్ సీజన్లో 70.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్ పెట్టుకుంది. ఈ లెక్కన ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున మొత్తం1.40 కోట్ల ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయి. కానీ ఇప్పటికీ ప్రైవేటు కంపెనీల నుంచి అందుబాటులో ఉన్న కాటన్ సీడ్ ప్యాకెట్లు 90 లక్షలేనని లెక్కలు చెప్తున్నయి. ఇంకా 50 లక్షల ప్యాకెట్లు తక్కువ ఉన్నయి. ఇదే అదనుగా సీడ్ మాఫియా నకిలీ లేబుళ్లు తయారు చేసి, నాసిరకం విత్తనాలను ప్యాక్ చేస్తూ రైతులకు అంటగడుతున్నాయి. రాష్ట్రంలో మిర్చి సీడ్స్ కు కూడా కొరత ఉండటంతో నకిలీ ముఠాలు రెచ్చిపోతున్నయి. ఒక్కో కాటన్ సీడ్ ప్యాకెట్ ధర రూ.700 వరకు ఉంటుంది. ఇలా అక్రమార్కులు పత్తి విత్తనాలపైనే రూ.700 కోట్ల దందా చేస్తారని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొందరిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నా, పైనుంచి ప్రెజర్ల వల్ల నామమాత్రపు కేసులతో సరిపెట్టాల్సి వస్తోందని ఆయన తెలిపారు. సర్కార్ కంపెనీల ద్వారా పకడ్బందీగా కాటన్ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి తెస్తే ఇలాంటి అక్రమాలకు చెక్ పడుతుందని అంటున్నరు. 

పాత సీడ్స్ రీసైకిల్‌‌ చేస్తున్నరు

నకిలీ, నాసిరకం సీడ్స్​చాలా వరకూ ఏదో ఒక లేబుల్ చేసి ప్యాక్ చేస్తున్నరు. కొన్ని మాత్రం ప్యాకింగ్ చేయకుండానే లూజ్​గా అమ్ముతున్నారు. లైసెన్సులు లేకున్నా సీడ్స్ విక్రయిస్తున్నారు. జర్మినేషన్​(మొలకలు) రాదని తేల్చిన సీడ్స్​ను కూడా ప్యాకింగ్​చేసి గుట్టుచప్పుడు కాకుండా సప్లై చేస్తున్నారు. మరికొందరు ఎక్స్ పైరీ డేట్ ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్​చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. కాలంతీరిన విత్తనాలను క్వాలిటీ టెస్ట్​చేయకుండా, డేట్లు మార్చి మళ్లీ అమ్మకానికి పెడుతున్నరు. ఇక సాగుకు అనుమతి లేని హెచ్​టీ (బీజీ 3) విత్తనాలు కొకొల్లలుగా పట్టుబడుతున్నయి. ఉమ్మడి మహబూబ్​నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నకిలీలు ఎక్కువగా దొరుకుతున్నాయి. నకిలీ సీడ్స్ ఈ జిల్లాల నుంచి మిగిలిన ప్రాంతాలకు సప్లై అవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. 
కఠిన చట్టం ఇంకెప్పుడు? 
రాష్ట్రస్థాయిలో సీడ్ యాక్ట్ పకడ్బందీగా అమలు కావడం లేదు. కేసులు పెడుతున్నా, అక్రమార్కులు ఈజీగా బయటపడుతున్నరు. నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టం తెస్తామని సీఎం కేసీఆర్​అనేకసార్లు ప్రకటించారు. నకిలీ విత్తన దందా చేసే వారిపై కఠిన చర్యలతో పాటు, నష్టపోతే రైతులకు పరిహారం ఇప్పించేలా 2015లో వ్యవసాయ శాఖ డ్రాప్ట్​ను కూడా సిద్ధం చేసింది. అయితే సీడ్ మాఫియా ఒత్తిడితో దానిని పక్కన పడేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నయి. వ్యవసాయ శాఖపై రివ్యూ చేసిన ప్రతిసారి సీఎం నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేద్దాం అంటున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. అనుమతి లేని సీడ్స్ సాగు చేస్తే ఎన్విరాన్​మెంటల్ ప్రొటెక్షన్ (ఈపీ యాక్ట్​) కింద ఏడేండ్ల జైలు శిక్ష వేసేందుకు అవకాశం ఉన్నా, దానిని కూడా వాడటం లేదు. పీడీ యాక్టులపై వ్యవసాయ శాఖ ఒక లెక్క, పోలీసు డిపార్ట్​మెంట్​మరో లెక్క చెబుతోంది. అయితే దేశవ్యాప్తంగా నకిలీలు, అనుమతి లేని విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సీడ్ యాక్ట్​డ్రాప్ట్​ను పార్లమెంట్​లో గతేడాది ప్రవేశపెట్టింది. కానీ కరోనా, లాక్​డౌన్ ల​కారణంగా ఆ బిల్లు ఇంకా చర్చకు రాలేదు.