
- ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు
- డీప్ మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు
- మ్యాన్‌హోళ్ల మూతలు తెరిస్తే కఠిన చర్యలు
- ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో మ్యాన్‌హోళ్లపై మెట్రో వాటర్‌బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాల సమయంలో మ్యాన్‌హోళ్ల మూతలు తీసే వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. అలాగే సీవరేజి తరచూ ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాల పట్ల అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల పాతబస్తీలోని మ్యాన్‌హోల్‌లో ఓ బాలిక పడిపోయిన నేపథ్యంలో వాటర్‌బోర్డు అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. ఈ సంఘటనతో వాటర్‌బోర్డుకు సంబంధం లేకపోయినా అలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకే అధికారులను ఆయా డివిజన్ల పరిధిలో పరిశీలించాలని బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. దెబ్బతిన్న, ధ్వంసమైన మాన్హాళ్లు, వాటి కవర్లను పునర్నిర్మించాలన్నారు.
ఏ ప్రాంతంలోనూ మ్యాన్‌హోళ్లకు మూతలు లేకుండా ఉండొద్దని, ప్రతి డివిజన్, సెక్షన్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా లోతైన మాన్హోళ్లకు సేఫ్టీ గ్రిల్లులు ఏర్పాటు చేయాలని, స్థానికుల నుంచి ఎంసీసీ (మెట్రో కస్టమర్ కేర్)కు వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కూడా నిర్ణయించారు. చాలా మంది ప్రజలు వర్షాలు కురుస్తున్న సమయంలో వర్షపునీరు వెళ్లడానికి మ్యాన్‌హోళ్లను తెరుస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవవద్దని, అలా తెరిచిన వారిని గుర్తించి వాటర్‌బోర్డు చట్టంలోని సెక్షన్–74 ప్రకారం నేరంగా వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
5.20 లక్షల మ్యాన్‌హోళ్లు
గ్రేటర్‌పరిధిలో రకరకాల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ఇందులో కొన్ని జీహెచ్ఎంసీకి చెందినవి కాగా, మరికొన్ని మెట్రోవాటర్బోర్డుకు చెందినవి ఉన్నాయి. ఒక్కమెట్రో వాటర్‌బోర్డుకు చెందిన మ్యాన్‌హోళ్లు 5.20 లక్షల వరకు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 21 వేల డీప్మ్యాన్హోళ్లు (ఒక మీటర్నుంచి ఐదు మీటర్ల లోతైనవి) ఉన్నాయి. ఇలాంటి మ్యాన్‌హోళ్లలో పడితే బతకడం కష్టం. ఎందుకంటే లోతు ఎక్కువగా ఉండడంతోపాటు, పడిన వారు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఇప్పుడు వర్షాకాలంలో ఇలాంటి మ్యాన్‌హోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి మ్యాన్హోళ్లుఎక్కువగా మెయిన్ రోడ్లపైన, కాలనీలు, బస్తీల్లోని రోడ్లకు మధ్యలో ఉంటాయి.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఉన్న మ్యాన్హోళ్లకండిషన్పై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న మ్యాన్హోళ్లకుకు కవర్‌తో పాటు దానికి ఒక అడుగు కింద సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా ప్రమాదవశాత్తూ ఇందులో పడి పోయినా పూర్తిగా మునిగిపోకుండా సేఫ్టీగ్రిల్కాపాడుతుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 30 శాతం మ్యాన్‌హోళ్లకు మాత్రమే సేఫ్టీగ్రిల్స్ ఏర్పాటు చేశారు. త్వరలోనే మిగిలిన వాటికి కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని అన్ని మ్యాన్‌హోల్స్ పై తప్పని సరిగా కవర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు లోకల్అధికారులను ఆదేశించారు.