
‘‘సోషల్ మీడియా ప్రభావం నుంచి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఉరుకులు పరుగుల ఈ బిజీ జీవితాల్లో కనీసం వారంలో ఓ పూట అయినా పిల్లలతో పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్లకు బాధ్యతల్ని నేర్పించాలి. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వర్డ్‌లో బతకాలని పిల్లలకు చెప్పాలి” అన్నాడు సాయి దుర్గ తేజ్.
భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో నిర్వహించిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’లో తేజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘నా సెకండ్ క్లాస్లోనే లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పా. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు ఆమె ఇచ్చారు. పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి.
సోషల్ మీడియాలో పిల్లలను అబ్యూజ్ చేస్తూ డార్క్ కామెడీ పేరుతో పిచ్చి కామెంట్స్ రావడం చూసి బాధనిపించి రియాక్ట్ అయ్యా. అలాగే అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఓ స్కూల్ నిర్మించా. తెలంగాణలో కూడా కొందరు చిన్నారుల్ని దత్తత తీసుకుని వారి చదువు, పోషణ చూసుకుంటాను’ అని చెప్పాడు.
మంత్రి సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ భవిన్ పాండ్య, నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ ఛైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి కార్యక్రమంలో అతిథులుగా హాజరయ్యారు.