మత్స్యశాఖ మహిళా సంఘాలకు చేయూత : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

మత్స్యశాఖ మహిళా సంఘాలకు చేయూత : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
  •  కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ ​వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్​వెలుగు: ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని మత్స్యశాఖ మహిళా సంఘాలకు చేయూతనిస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాశ్​తో కలిసి 134 మంది మత్స్యకారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర సర్కార్​ ఇందిరా మహిళా శక్తి పథకం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు ఇతర కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తోందని అన్నారు. మత్స్యశాఖ మహిళా సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

జిల్లాలో 132 సంఘాలు నమోదయ్యాయని, సంఘం సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఇన్సురెన్స్​ కల్పిస్తోందన్నారు. మత్స్యకారుల మహిళా సంఘాలకు ప్రభుత్వంరూ.21 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని మత్స్యకార సహకార సంఘం బాధ్యులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు చెన్నూరు పట్టణంలోని 14వార్డు ఆదర్శనగర్​లో రూ.6.80 లక్షల డీఎంఎఫ్​టీ ఫండ్స్​తో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొట్టుకపోయిన చెన్నూరు మండలం అక్కెపల్లి వాగు కాజ్​వేను మంత్రి పరిశీలించారు. రూ.5లక్షల ఫండ్స్ కేటాయించామని, త్వరలో రిపేర్లు చేపడుతామన్నారు.

బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ 

పలు బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. రామకృష్ణాపూర్​పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ పుల్లూరి కల్యాణ్, మున్సిపల్​మాజీ కౌన్సిలర్​ సుధాకర్ ​సోదరుల తల్లి భూమక్క, అమ్మ గార్డెన్స్​ఏరియాలో ఐఎన్టీయూసీ లీడర్ ​చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి రాజిరెడ్డి, శ్రీనివాస్​నగర్​లో కుశనపల్లి నవీన్, మందమర్రి శ్రీపతినగర్​లో కోల ఆరుణ్​కుమార్, మారుతీనగర్​లో మంచికట్ల శంకరయ్య ఇటీవల చనిపోగా వారి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మందమర్రికి చెందిన కాంగ్రెస్ ​కార్యకర్తలు పాషా, రామకృష్ణను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు.

శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందించాలి

భారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత నృత్య గురువులపై ఉందని మంత్రి వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణపై 108 మంది పిల్లలు, వారి తల్లులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి జయ జయహే గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా గుర్తించారని పేర్కొన్నారు.

ఈ గీతం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు,చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రిని స్నేహ ఫౌండేషన్ చైర్మన్ కేవీ ప్రతాప్, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ చిదానంద కుమారి సన్మానించారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వండర్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ వండర్ రికార్డ్స్, నైన్ స్టార్ ఆఫ్ వండర్ సంస్థల ప్రతినిధులు మంత్రి చేతుల మీదుగా చిదానంద కుమారి, కేవీ ప్రతాప్​కు అవార్డు అందజేశారు.