
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్పేట బతుకమ్మ కుంటను ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిసింది. పూర్తిగా చెట్లు, చెత్త, పిచ్చి మొక్కలతో పేరుకుపోయిన బతుకమ్మ కుంటను చెరువుల పునరుద్ధరణలో భాగంగా రూ.7.40 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేసింది. పనులు చివరిదశకు చేరుకున్నాయి. 5 ఎకరాల 12 గుంటల్లో ఉన్న బతుకమ్మ కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది.
1962–63 లెక్కల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల 6 గుంటల్లో బతుకమ్మ కుంట ఉండగా, అప్పట్లో బఫర్ జోన్ తో కలిపి 16 ఎకరాల13 గుంటలు ఉండేది. క్రమంగా ఆక్రమణలకు గురికాగా, తాజాగా హైడ్రా నిర్వహించిన సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలు ఉన్నట్లు గుర్తించి ఈ స్థలంలో చెరువుని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఉత్పవాలు ఇక్కడే నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా హైడ్రా పనులు చేసింది. ఒకప్పటి బతుకమ్మ కుంటతో ప్రస్తుతం పోలిస్తే పూర్తిగా రూపురేఖలు మారాయి.