ప్రాణహిత ప్రాజెక్ట్ ను ప్రారంభించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : ఎమ్మెల్సీ దండే విఠల్

 ప్రాణహిత ప్రాజెక్ట్ ను ప్రారంభించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను :  ఎమ్మెల్సీ దండే విఠల్
  • ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ 

కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ హయంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మూలకుపడిన ప్రాణహిత ప్రాజెక్టుకు జీవం పోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. శనివారం ఆయన కౌటాల మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్​లో చేరిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులకు కండువా కప్పి ఆహ్వానించారు. 

కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులకు నష్టం చేసిన ప్రాణహిత ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై పలుమార్లు రివ్యూ మీటింగ్ నిర్వహించారని గుర్తుచేశారు. కేంద్రం వైఖరి కారణంగానే యూరియా విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గజ్జి రామయ్య, మాజీ ఎంపీపీ నానయ్య, పార్టీ మండల అధ్యక్షుడు నికాడి గంగారాం, నాయకులు పాల్గొన్నారు.