
- కేబుల్ వైర్ల కటింగ్ తక్షణమే ఆపేయాలి
- ఇందిరాపార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల మహా ధర్నా
- హాజరైన మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ముషీరాబాద్, వెలుగు: ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు వరుసగా కేబుళ్లు తొలగించడం ద్వారా కేబుల్ పరిశ్రమలో ఉన్న ఆరు లక్షల మంది ఉపాధి దెబ్బతింటోందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ వైర్లను కరెంట్ పోల్స్ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి కేబుల్ ఆపరేటర్లు ఈ ధర్నాకు తరలివచ్చారు. బూర నర్సయ్య గౌడ్తోపాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్హాజరై మద్దతు తెలిపారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపించి షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
కేబుళ్ల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కేబుల్ ఆపరేటర్లపై ప్రతాపం చూపించడం సరికాదన్నారు. కేబుళ్లను తొలగించుకోవడానికి ఆపరేటర్లకు సమయం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ కేబుల్ ప్రొవైడర్ కంపెనీల కోసమే కేబుల్ ఆపరేటర్ల వృత్తిని దెబ్బతీస్తుందన్నారు. ఇప్పటికైనా కేబుల్ వైర్లను కట్ చేయడం తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కర్ణాకర్, సతీశ్ బాబు, అబ్దుల్ సలాం, అరవింద్, నవీన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.