
చదువుకో బడికి పంపిస్తే..ఈ విద్యార్థి ఏం చేశాడో చూడండి.. చక్కగా విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన విద్యార్థి..తోటి విద్యార్థితో గొడవపడి దారుణంగా దాడి చేశాడు. ఏకంగా వీధి రౌడీలా కత్తితో దాడి చేశాడు. కర్కశంగా గొంతుకోసి చంపేశాడు. కేవలం గొడవ కారణంగా కత్తితో దాడి చేసి చంపడం సంచలనం సృష్టించింది. విద్యార్థికి చావుకు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అతని బంధువులు స్కూల్ పై దాడి చేశారు. చేతికందినవి ధ్వంసం చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సెవెంత్-డే అడ్వెంటిస్ట్ పాఠశాలలో బుధవారం(ఆగస్టు20) జరిగింది.
అహ్మదాబాద్ నగరంలోని సెవెంత్-డే అడ్వెంటిస్ట్ పాఠశాలలో మంగళవారం జరిగిన ఒక ఘర్షణలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 8వ తరగతి విద్యార్థి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. తమ బిడ్డ మరణానికి పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు, స్నేహితులు పాఠశాలపై దాడికి దిగారు.
ఆగ్రహించిన బంధువులు పాఠశాలలోకి చొరబడి టీవీలు, అద్దాలు, అలాగే పార్కింగ్ చేసిన కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడు మైనారిటీ వర్గానికి చెందినవాడు కావడంతో కొన్ని హిందూ సంఘాలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్తలు కూడా పాఠశాల బయట నిరసనలు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు:
అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక ప్రకారం..వారంక్రితం జరిగిన గొడవ కారణంగా ఈ ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత మంగళవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే 15 ఏళ్ల విద్యార్థి కత్తితో 10వ తరగతి విద్యార్థిని పొడిచాడు.
గాయపడిన విద్యార్థిని పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. పోలీసులు మొదట హత్యాయత్నం కేసు నమోదు చేయగా విద్యార్థి మరణం తర్వాత కేసు హత్యగా మారింది. జిల్లా అధికారులు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, వివరణాత్మక దర్యాప్తును ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై పాఠశాల భద్రత, విద్యార్థుల మధ్య హింస గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.