భారతదేశ వైట్ కాలర్ జాబ్స్ అంటే ఐటీ, కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులు త్వరలోనే ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? ఏఐ కేవలం ప్రయోగాల దశ దాటి, ఆచరణలోకి వస్తుండటంతో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ప్రస్తుతం ఐటీ రంగంలో జరుగుతున్న లేఆఫ్‌లు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని స్పష్టం చేశారు.
అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం 'సర్వీస్‌నౌ' నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారతదేశంలో దాదాపు కోటి 80 లక్షల మంది ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడనుంది. దీని స్థానంలో కేవలం 30 లక్షల కొత్త టెక్నాలజీ ఉద్యోగాలు మాత్రమే పుట్టుకొచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఈ మార్పు చాలా వేగంగా, ఊహించని విధంగా ముంచుకురాబోతోందన్నారు ముఖర్జీ.
ప్రస్తుతం కోడింగ్ వంటి సాంకేతిక పనుల్లో ఏఐ నమ్మకశక్యత 50 శాతానికి చేరింది. రాబోయే 2-3 ఏళ్లలో ఇది 90 నుండి 100 శాతానికి చేరుకుంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, యాపిల్, ఆంత్రోపిక్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు గత 12 నెలల్లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, డేటా సెంటర్ల కోసం దాదాపు 800 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.
గత కొన్ని నెలలుగా ఈ భారీ పెట్టుబడుల నుండి టెక్ కంపెనీలకు విపరీతమైన ఆదాయం రావడం మొదలైంది. ఉదాహరణకు ఆంత్రోపిక్ సంస్థకు చెందిన 'క్లాడ్ ఏఐ' ప్లాట్‌ఫారమ్ వార్షిక ఆదాయం 2025 ప్రారంభంలో రూ.9వేల కోట్లుగా ఉండగా.. కేవలం 15 నెలల్లోనే అది 30 బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ.2లక్షల 70వేల కోట్లకు పెరిగింది. ఈ మలుపు వల్ల కంపెనీలు మానవ శ్రమను తగ్గించి, రోబోటిక్ ఆటోమేషన్‌ను మరింత వేగవంతం చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.
ALSO READ : మార్కెట్ క్యాప్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి టాప్-5 లోకి దూసుకెళ్లిన తైవాన్..
భారతదేశంలోని 58% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐ పై, 80% పైగా సంస్థలు జెనరేటివ్ ఏఐ పై పెట్టుబడులు పెడుతున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సెంటర్లలో జరిగే పనుల్లో 24% పనులను పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయవచ్చు, మరో 42% పనులను ఏఐ సహాయంతో సులభతరం చేయవచ్చు. పూర్తిగా ఆటోమేట్ చేయగల ఆ 24 శాతం పనుల నుండి మనుషులను తొలగించడం కంపెనీలకు చాలా సులువైన విషయమని ముఖర్జియా చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాలను మార్చుకోకపోతే మనుగడ కష్టమేనని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
