ఏఐ క్లాసులపై ఆసక్తి.. ప్రైమరీ స్కూళ్లలో పెరిగిన అటెండెన్స్

ఏఐ క్లాసులపై ఆసక్తి.. ప్రైమరీ స్కూళ్లలో పెరిగిన అటెండెన్స్

 

  •     నో మోర్​ డ్రాపవుట్ పేరిటడాక్యుమెంటరీ
  •     శెట్పల్లి స్కూల్​ కాంప్లెక్స్ హెచ్​ఎం చొరవ 

కామారెడ్డి, వెలుగు: చదువు పట్ల స్టూడెంట్స్​లో ఆసక్తి పెంచేందుకు, పాఠాలు ఈజీగా అర్థమయ్యేలా చేసేందుకు ప్రైమరీ స్కూళ్లలో ప్రారంభించిన ఏఐ (ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​) క్లాసులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఏఐ బోధన జరుగుతున్న స్కూళ్లలో స్టూడెంట్స్​ రెగ్యులర్​గా వస్తుండడంతో అటెండెన్స్ మెరుగయ్యింది. డ్రాప్​ అవుట్స్​ కూడా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని శెట్​పల్లి కాంప్లెక్స్​ స్కూల్ పనితీరు ఆధారంగా ‘నోమోర్​ డ్రాప్​ అవుట్​’పేర డాక్యుమెంటరీ తీశారు.  చదువులో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకునేందుకు ప్రైమరీ స్కూల్స్​లో ప్రభుత్వం ఏఐ క్లాసులు నిర్వహిస్తోంది. 

కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 27 ప్రైమరీ స్కూల్స్​ను ఎంపిక చేశారు. ఏఐ విధానం పట్ల పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్లాస్​లు కొనసాగుతున్న చోట్ల స్టూడెంట్స్​ రెగ్యులర్​గా వస్తున్నారు. డ్రాపవుట్స్​ తగ్గాయి. కంప్యూటర్​ ద్వారా మ్యాథ్స్​, తెలుగు లాంటి సబ్జెక్టులు చెప్తున్నారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఏఐ ద్వారా పాఠాలు చెప్పటంతో సులభంగా నేర్చుకుంటున్నారు. 3,4,5 తరగతుల స్టూడెంట్స్​కు రోజు ఒక్కో సబ్జెక్టుపై 20 నిమిషాలు క్లాస్​ఉంటుంది. గతంలో కొన్ని ప్రైమరీ స్కూల్స్​లో అటెండెన్స్​ అంతంతమాత్రంగా ఉండేది. ఇప్పుడు ఏఐ క్లాసులతో స్టూడెంట్స్​ రోజూ వస్తున్నారు. 

శెట్పల్లి స్కూల్ ఆధారంగా డాక్యుమెంటరీ 

శెట్పల్లి కాంప్లెక్స్​ స్కూల్ పరిధిలోని ప్రైమరీ స్కూల్​లో ఏఐ క్లాస్​లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రైమరీ స్కూల్​లో 66 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. గతంలో ఈ స్కూల్​కు విద్యార్థులు రెగ్యులర్​గా వచ్చేవారు కాదు. ఏఐ క్లాస్​లు పాఠాలు ఈజీగా నేర్చుకునే అవకాశం ఉండడంతో స్టూడెంట్స్​ డుమ్మా కొట్టడంలేదు. స్కూలు మానేసిన ఇద్దరు స్టూడెంట్లు కూడా ఏఐ విధానం పట్ల ఆసక్తితో తిరిగి బడికి వస్తున్నారు. స్టూడెంట్లలో చదువు మీద పెరిగిన ఆసక్తి, డ్రాపవుట్ లేకపొవటం తదితర అంశాలను హైలెట్​ చేస్తూ నో మోర్​ డ్రాపవుట్స్​ పేరిట డాక్యుమెంటరీ తీశారు. ఇందుకోసం హైస్కూల్​ హెచ్​ఎం వసుధ రూ. 50వేలు ఖర్చు చేశారు. ఎక్కపల్లి ప్రైమరీ స్కూల్​లో పని చేస్తున్న అఖిల్​ ఏఐ క్లాస్​లకు స్టేట్​ రిసోర్స్​పర్సన్​గా ఉన్నారు. ఈయనే డాక్యుమెంటరీకి డైరెక్టర్​గా వ్యవహరించారు. 

ఈస్కూళ్లలో ఏఐ క్లాస్​లు 

 లింగంపేట మండలం శెట్పల్లి, మోతె తండా, పోతాయిపల్లి, బాన్సువాడ మండలం తాడ్కోల్​, హన్మాజిపేట, బొల్లారం, బీబీపేట మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి, జుక్కల్​ మండలంలో హంగర్గ, బిచ్​కుంద మండలంలో హస్కుల్​, గుండెనెమ్లి, జామ మసీద్​, నస్రుల్లాబాద్​ మండలంలో బోమ్మ దేవునిపల్లి, మహమ్మద్​నగర్​ మండలం కొమలంచ, రాజంపేట మండలంలో బసన్నపల్లి, రాజంపేట, రామారెడ్డి మండలం రెడ్డిపేట తండా , మద్దికుంట, సదాశివనగర్​ మండలం కుప్రియాల్, పద్మాజీవాడి, మర్కల్, తాడ్వాయి మండలం కన్​కల్​, కరడ్​పల్లి, చిట్యాల, ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలోని ప్రైమరీ స్కూల్స్​లో ఏఐ క్లాస్​లు నిర్వహిస్తున్నారు. హైస్కూల్స్​లో ఉన్న కంప్యూటర్లను ఏఐ క్లాసులకు వాడుకోవాలని భావించిన అధికారులు తొలివిడతలో హైస్కూల్స్​ కాంపౌండ్​లో ఉన్న ప్రైమరీ స్కూల్స్​నే ఏఐ క్లాస్​లకు సెలక్టు చేశారు. త్వరలో ప్రైమరీ స్కూల్స్​కు కంప్యూటర్లు మంజూరు చేసే అవకాశముంది.

మార్పులు గమనించి డాక్యుమెంటరీ తీశాం

ఏఐ క్లాస్​లతో విద్యార్థుల్లో మార్పులు వస్తున్నాయి. సబ్జెక్టును సులభంగా నేర్చుకుంటున్నారు. వారి సామర్థ్యాలను ఆధారం చేసుకొని పాఠాలు వస్తుండటంతో వారిలో ఆసక్తి పెంచుతుంది. రెగ్యులర్​గా విద్యార్థులు స్కూల్​కు రావటాన్ని గమనించాం. దీని ఆధారంగానే డాక్యుమెంటరీ తీశాం. ఇందుకోసం సొంతంగా రూ. 50వేలు ఖర్చు చేశా. - వసుధ, హెచ్​ఎం , శెట్పల్లి 

విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది

 ఏఐ బోధన విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఇబ్బంది పడకుండా విషయాలను నేర్చుకుంటున్నారు. రెగ్యులర్​ క్లాస్​లో అందరినీ దృష్టిలో పెట్టుకొని టీచర్లు క్లాస్​లు చెబుతారు. కానీ ఏఐలో అలా ఉండదు. ఆ విద్యార్థి సామర్థ్యాన్ని పసిగట్టి దాని ఆధారంగానే సులభంగా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన మార్పు మిగతావాళ్లకూ స్ఫూర్తి కావాలని నో మోర్​ డ్రాపవుట్​ పేరిట డాక్యుమెంటరీ తీశాం.- అఖిల్​ , స్టేట్​ రిసోర్స్​ పర్సన్​