భారతదేశం ఆతిథ్యమిచ్చి విజయవంతంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పలు దేశాధినేతలు పాల్గొని ప్రపంచ అభివృద్ధిపై ఏఐ ప్రభావం గురించి విస్తృతంగా చర్చించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొని ఏఐ అభివృద్ధి ప్రణాళికలను, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై ఏఐ ప్రభావాలను కూలంకుషంగా చర్చించడం జరిగింది.
ఈ సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా కృత్రిమ మేధను సామాజిక మార్పు కోసం ఎలా ఉపయోగించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పడంలో విజయవంతమైంది. ఏఐ వల్ల ప్రపంచ వృద్ధి రేటు 0.8% పెరుగుతుందని, వికసిత్ భారత్ లక్ష్యానికి చేరువవుతుందని ఐఎంఎఫ్ అధినేత్రి క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు.
ఏఐకు సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేసిన నాస్కామ్, ఇన్ డీడ్ నివేదికలను, ఏఐ టూల్స్‌పై పనిచేస్తున్న అంతర్జాతీయ నిపుణుల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
సమాచార విప్లవానికి నాంది పలికిన అద్భుతమైన ఆవిష్కరణ ఇంటర్నెట్. అనేక రంగాల్లో ప్రభావం చూపిస్తూ సమాజం పనితీరుని నిర్ధారించే విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానం ఏఐ. కృత్రిమ మేధపై అనేక రకాల వార్తలు, చర్చలు, సమావేశాలు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. సహజసిద్ధమైన మానవ మేధస్సుకు పదును పెట్టి, సందర్భానుసారంగా స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని కృత్రిమ మేధస్సు తారుమారు చేస్తుందని వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊడతాయని ప్రచారం కూడా జరుగుతోంది. అవన్నీ ఊహాగానాలే అని, నిజానికి ఏఐ టూల్స్‌లో పరిజ్ఞానం పెంచుకునే యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని కొందరి వాదన. మానవ జీవన విధానంలోకి ఒక కొత్త సాంకేతిక వ్యవస్థ ఉద్భవించినప్పుడు అది ఎలా ఉంటుందో అనే అనిశ్చిత స్థితి, అపోహలు కలగడం సహజం. ఈ భ్రమలు తొలగాలంటే కృత్రిమ మేధస్సుపై స్పష్టమైన సమాచార వ్యవస్థ, శిక్షణ, దాని ప్రయోజనాలు, భద్రతాపరమైన అంశాలపై సరైన అవగాహన ఏర్పరుచుకోవాలి.
సమాచార విశ్లేషణ
కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పనిచేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లు మనుషులు చేసే పనులను కంప్యూటర్ ద్వారా అత్యంత వేగంగా పూర్తిచేస్తాయి. సమాచార విశ్లేషణ, సమస్యలను పరిష్కరించడం వంటి పనులను ఏఐ ద్వారా సునాయాసంగా చేయవచ్చు. ఏఐ ఏ రంగాలలో ఎంతవరకు, ఏ విధంగా వాడుకోవాలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ, అలెక్సా, కాపిలాట్ ఏఐ సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తూ సమాచారాన్ని సెకండ్ల వ్యవధిలో పొందగలుగుతున్నారు.
కొన్ని సందర్భాలలో ఏఐ ద్వారా నాణ్యత లోపించిన అసంపూర్ణమైన సమాచార ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రశ్నకు సంబంధించి తగినంత పరిపూర్ణ సమాచారం లేనప్పుడు, ఎఐ అసంబద్ధమైన లేదా పాత సమాచారాన్ని అందించవచ్చు. కాబట్టి వాటిని గుడ్డిగా నమ్మకుండా సరైన వాస్తవాలతో పోల్చి చూసుకోవడం అవసరం. పనుల కోసం ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల మనుషుల్లో క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ ప్రయోజనాలు
మనిషి 8 నుంచి 10 గంటల వరకు పనిచేయగలిగితే కృత్రిమ మేధ 24 గంటలు నిరంతరం పనిచేయగలదు. ఏఐ సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించుకుంటే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉత్పాదకత పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. రక్షణరంగంలో ఉపయోగించే డ్రోన్లు, మిసైల్స్ సామర్థ్యాన్ని సమూలంగా ఏఐ మారుస్తుంది. వ్యవసాయంలో రైతుకు అధిక దిగుబడి అందేవిధంగా ఏఐ సాంకేతికత రూపొందిస్తే ఆ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది.
వాతావరణ పరిస్థితుల విశ్లేషణ, చీడపీడల తొలగింపు, మార్కెట్ అంచనాలపై రైతులకు కచ్చితమైన సమాచారాన్ని అందించే సరళమైన టూల్స్ అందుబాటులోకి తేవాలి. రైతులు వ్యవసాయ పనులను సునాయాసంగా చేసుకునేవిధంగా ఏఐ ఆధారిత రోబోలు, డ్రోన్లను అభివృద్ధి చేసి సబ్సిడీ ధరలపై పంపిణీ చేయాలి. ఈ సందర్భంగా మహారాష్ట్రలో బారామతి వంటి ప్రాంతాల్లో రైతులు ఏఐ సాంకేతికతను ఉపయోగించి చెరుకు సాగులో అద్భుతమైన ఫలితాలను సాధించారు. వచ్చే ఏడేళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐని సామాన్యుడికి అందుబాటులోకి తెస్తామని ముకేశ్ అంబాని తెలపడం ఏఐ ప్రాధాన్యతను తెలుపుతోంది.
స్టార్టప్స్ పాత్ర కీలకం
దేశాభివృద్ధిలో అంకుర సంస్థల (స్టార్టప్స్) పాత్ర అత్యంత కీలకం. ఏఐ రంగం ప్రయోజనకరంగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అంకుర సంస్థలకు మెరుగైన ప్రోత్సాహం అందాలి. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించడమేకాక ప్రారంభ దశలో అవసరమైన మేరకు నిధులను అందించాలి. నిపుణులతో శిక్షణ, సరళీకృతమైన నిబంధనలు వంటి సదుపాయలతో చేయూతనివ్వాలి. కేంద్ర ప్రభుత్వం
రూ.10,371 కోట్ల బడ్జెట్‌తో ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించింది. వచ్చే ఐదేళ్ల కాలంలో దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం.
ఏఐపై ప్రాథమిక అవగాహన కల్పించాలి
కృత్రిమ మేధ అభివృద్ధికి సంబంధించిన పాఠ్యాంశాలను సాంకేతిక విద్యకు సంబంధించిన అన్ని రకాల కోర్సులలో ప్రవేశపెట్టాలి. ఇతర కోర్సులలో సైతం ఏఐపై ప్రాథమిక అవగాహన కల్పించాలి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కృత్రిమ మేధ పరిశోధనలు, అభివృద్ధిపై దృష్టి పెట్టడం స్వాగతించదగ్గ పరిణామం. ఏఐ అసలు లక్ష్యం మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే. అయితే మానవీయ విలువలకు ప్రాధాన్యత లేని, సామాజిక భద్రత కొరవడిన ఏఐ ఏవిధంగానూ హర్షణీయం కాదు.
- ఆర్ సి కుమార్, సోషల్ యాక్టివిస్ట్
