సర్కారు బడి పిల్లలకు ఏఐ పాఠాలు..డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులే టీచర్లు

సర్కారు బడి పిల్లలకు ఏఐ పాఠాలు..డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులే టీచర్లు
  • అన్నఅక్క మెంటార్‌షిప్ పేరుతో టీచింగ్
  • ఇంటర్న్ చేసిన స్టూడెంట్లకు అకాడమిక్ క్రెడిట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భావి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ‘అన్న.. -అక్క మెంటార్‌షిప్’ పేరుతో వినూత్న టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం జులై నుంచి సెప్టెంబర్ 2026 మధ్య రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. గతంలో 19 ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు దీనిని 33 జిల్లాల పరిధిలోని 8,522 సర్కారు హైస్కూళ్లకు విస్తరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సరికొత్త టెక్నాలజీపై శిక్షణ ఇస్తారు.

ఏ తరగతికి ఏం నేర్పిస్తారంటే.. రాష్ట్రవ్యాప్తంగా 196 డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల నుంచి 39,828 మంది విద్యార్థులను ప్రభుత్వం ఏఐ మెంటార్లుగా గుర్తించింది. పాలిటెక్నిక్, డిగ్రీ 5వ సెమిస్టర్, ఏఈడీపీ  కోర్సులో 3వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ కాలేజీలకు సమీపంలో ఉన్న స్కూళ్లకు వెళ్లి ఈ క్లాసులు బోధిస్తారు. ఇందులో భాగంగా 6 నుంచి 8వ తరగతి పిల్లలకు డిజిటల్ లిటరసీ, ఇంటర్నెట్ సేఫ్టీ, కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ ప్రాథమిక అంశాలు, గేమ్ డిజైనింగ్ నేర్పిస్తారు.

అదేవిధంగా 9, 10 తరగతుల విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ ఎథిక్స్ వంటి అడ్వాన్స్‌డ్ అంశాలపై అవగాహన కల్పిస్తూ మినీ ప్రాజెక్టులు చేయిస్తారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని పకడ్బందీగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ‘కోడ్‌మిత్ర’ అనే డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంటర్న్‌ల రిజిస్ట్రేషన్, అటెండెన్స్, స్కూల్-కాలేజ్ మ్యాపింగ్‌ను ట్రాక్ చేస్తారు.

ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, ఓయూ వంటి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు మాస్టర్ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తూ ఈ మెంటార్లకు గైడెన్స్ ఇస్తారు. ఈ ప్రాజెక్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 9,001 మంది కాలేజీ విద్యార్థులు భాగస్వాములు కాబోతున్నారు. జిల్లా స్థాయిలో డీఈవోలు, మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్​ లెవల్​లో హెడ్ మాస్టర్లు పర్యవేక్షిస్తారు. కాగా, ప్రభుత్వ బడుల్లో విజయవంతంగా 30 గంటల పాటు టీచింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన కాలేజీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఒక ‘నాన్-సీజీపీఏ’ అకాడమిక్ క్రెడిట్‌ను కేటాయించనున్నారు.