- జూబ్లీహిల్స్ విజయంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందనలు
- ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచన
- ఖర్గేను కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై మంత్రి వివేక్ వెంకటస్వామిని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఉప ఎన్నికలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను.. ‘వెల్ డన్ వివేక్’ అని భుజం తట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి బుధవారం రాత్రి మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయానికి కలిసి వచ్చిన అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం, కేడర్ మొబిలైజేషన్‌లో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అందించిన సహకారాన్ని కూడా ఖర్గేకు మంత్రి వివేక్ వివరించారు.
సమిష్టి కృషితోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లో వ్యూహాత్మక ప్రణాళికలు రచించి పార్టీని విజయం వైపు నడిపించినందుకు గాను మంత్రి వివేక్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావును ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీతో పాటు ప్రస్తుత సర్పంచ్, ఇతర ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని మంత్రి వివేక్‌కు, ఎంపీ వంశీకృష్ణకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే సూచించారు.

