నూతన జిల్లా కమిటీలతో కాంగ్రెస్ కు మరింత బలం : ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం

నూతన  జిల్లా కమిటీలతో కాంగ్రెస్ కు మరింత బలం  : ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం

మణుగూరు, వెలుగు: నూతన జిల్లా కమిటీల నియామకంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. జిల్లా కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా భద్రాద్రికొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఇన్​చార్జ్ జాన్సన్ అబ్రహం గురువారం మణుగూరులోని ఇల్లెందు గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ అనే పథకం ద్వారా జిల్లా కమిటీలను బలపరుస్తూ బాధ్యతాయుతమైన వ్యక్తులతో పార్టీ నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశం తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీ పునర్నిర్మానాన్ని చేపట్టామని, ఇందులో భాగంగానే జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమిస్తున్నట్లు చెప్పారు. 

జిల్లా కమిటీలతో పాటు మండల, బ్లాక్, గ్రామస్థాయి కమిటీలను పునరుద్ధరించి పార్టీ స్వరం ప్రతి మూలలో వినిపించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియ ఒక రాజకీయ సిద్ధాంతపరమైన ఉద్యమమని, భారత్ జోడోయాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రల ఆత్మను కొనసాగించే ప్రయత్నంలో భాగంగా చేపట్టామని తెలిపారు. ఈ అభియాన్ ద్వారా పార్టీ శక్తిని వికేంద్రీకరించి కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సభ్యులు పూనెం సరోజ, షబానా, శ్యామల, సౌజన్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.