కేటీఆర్ నీపై మూడు పుస్తకాలు బయటపెడతాను ...ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

కేటీఆర్ నీపై మూడు పుస్తకాలు బయటపెడతాను ...ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి మరో పదేండ్లు సీఎంగా ఉంటే తమ పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారని, అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాటి సభలో చెప్పారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో సీఎం అన్న మాటలను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రి పదవి హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. కేటీఆర్ మాటలు శ్రుతి మించుతున్నాయని, ఆయన తీరు మారకుంటే ఆయనపై మూడు పుస్తకాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ‘రావుగారి రాసలీలలు’, ‘కల్వకుంట్ల కథా కమామిసు’, ‘తారక్ తోడేళ్లు’ అనే మూడు పుస్తకాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని తప్పక బయటపెడతానని అన్నారు. రేవంత్ రెడ్డి మొనగాడు, మొగోడు కాబట్టే మిమ్మల్ని మట్టికరిపించాడని స్పష్టం చేశారు. ‘‘సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్ధతి నేర్చుకో కేటీఆర్’’ అని సంపత్ సూచించారు.