టీఆర్​ఎస్​లో చేరితేనే తెలంగాణ వాదులా?: దాసోజు శ్రవణ్

టీఆర్​ఎస్​లో చేరితేనే తెలంగాణ వాదులా?: దాసోజు శ్రవణ్
  • ఎమ్మెల్యేలను కొన్నప్పుడు నీతులు గుర్తుకురాలేదా?
  •  కేటీఆర్​పై దాసోజు శ్రవణ్ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: తమతో ఉంటే దేశ భక్తులు, లేకపోతే దేశ ద్రోహులు అనే పద్ధతి దేశంలో పెరిగిపోయిందన్న టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ప్రశ్నలు సంధించారు. దేశం గురించి మాట్లాడే కేటీఆర్​కు.. రాష్ట్ర ప్రజల విషయానికి వచ్చే సరికి ఆ సోయి ఎటుపోయిందని నిలదీశారు. ‘‘టీఆర్ఎస్ లో చేరితేనే తెలంగాణ వాదులా?  టీఆర్​ఎస్​, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను  ప్రశ్నించే వారిని తెలంగాణ ద్రోహులుగా మీరు ముద్రవేయలేదా?” అని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మాట్లాడుతున్న కేటీఆర్​కు..  ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అంగట్లో గొడ్లను కొన్నట్లు కొన్నప్పుడు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈ నీతి సూత్రం గుర్తుకు రాలేదా అని  శ్రవణ్ నిలదీశారు. ధర్నా చౌక్ ను ఎత్తి వేసి, ప్రశ్నించే గొంతుకలపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి, బెదిరించి జైళ్లలో పెట్టినప్పుడు ఈ తెలివి ఏమైందని దుయ్యబట్టారు. ‘‘ప్రజాస్వామ్య విలువల గురించి  మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ అసెంబ్లీలో, కౌన్సిల్ లో  కనీసం ప్రతిపక్షం లేకుండా చేయడం హిపోక్రసికి నిదర్శనం కాదా? మత రాజకీయాలు వద్దని సిద్ధాంతాలు వల్లించే మీరు..పచ్చి మతోన్మాద పార్టీ అయిన మజ్లిస్ తో  పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు..?  ఇది ప్రజల్ని మోసం చేయడానికి కాకుంటే, ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ పొత్తు రద్దు చేసుకుంటారా?” అని దుయ్యబట్టారు.

ఉత్తమ్​ను విమర్శించే స్థాయి లక్ష్మణ్​కు లేదు

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చీకటి రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని శ్రవణ్​ ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేసిన సైనికుడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, ఆయనను విమర్శించే స్థాయి లక్ష్మణ్​కు లేదని పేర్కొన్నారు.