రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలొస్తే కరోనా వస్తది సీఎం వస్తే రాదా?

రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలొస్తే కరోనా వస్తది సీఎం వస్తే రాదా?
  •     గవర్నరే రాజకీయాలు చేస్తున్నరు: ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
  •     కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం
  •    రాజకీయ డ్రామా అని విమర్శించడం సరికాదు

హైదరాబాద్, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్​ భర్త సౌందరరాజన్ కు సన్మానం చేశారు. ఆ కుటుంబంతో కలిసి ఫోటోలు కూడా దిగారు. అప్పుడు గవర్నర్​కు కరోనా గుర్తుకు రాలేదా? సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఫోటోలు దిగినా, సన్మానం చేసుకున్నా రాని కరోనా.. రైతుల పక్షాన ఒకరిద్దరు వినతిపత్రం ఇచ్చిపోతమంటే వస్తదా? కాంగ్రెస్ నేతలొస్తే కరోనా వస్తది, సీఎం వస్తే రాదా?” అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. దీన్ని బట్టి ఎవరు రాజకీయాలు చేస్తున్నరో ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ​నేతల పట్ల ఆమె మాట్లాడిన తీరు సరికాదని విమర్శించారు. కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాలను ఉప సంహరించుకోవాలంటూ కాంగ్రెస్ తరఫున వినతిపత్రం ఇచ్చేందుకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్​ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు గవర్నర్​ అపాయింట్​మెంట్​కోరారని చెప్పారు. కానీ గవర్నర్​ కరోనా వైరస్  పేరు చెప్పి కలవడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ఒకరిద్దరం వచ్చి వినతిపత్రం ఇస్తామని కోరినా.. కనీసం గేటు దగ్గరికి పీఆర్వోను పంపినా ఇస్తామని కోరినా మీరు (గవర్నర్) అనుమతి ఇవ్వలేదు. చివరికి మేం రాజ్ భవన్ గేటు వద్దకు వచ్చి మెమోరాండం అక్కడ పెట్టి వెళ్తామన్నా అనుమతి ఇవ్వకపోగా కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయించి, నిర్భంధానికి గురిచేయడం దురదృష్టకరం, అప్రజాస్వామికం” అని అన్నారు.

టీఆర్ఎస్​తో లోపాయికారీ ఒప్పందం

తమిళిసై చెప్పినట్టుగా రాజ్​భవన్ రాజకీయాలకు అడ్డా కావొద్దని, గవర్నర్ కూడా రాజకీయాలు చేయొద్దని శ్రవణ్​ పేర్కొన్నారు. కరోనా పేరుతో కాంగ్రెస్ టీంకు అనుమతి నిరాకరించి.. సీఎం కేసీఆర్ ను సన్మానం పేరుతో కలవడం వెనుక గవర్నర్ రాజకీయ కోణం తమకు అర్థం కావడం లేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నట్టు మరోసారి స్పష్టమైందని చెప్పారు. ప్రజల పక్షాన రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్​ ఉన్నారని, కోట్ల మంది రైతుల మెడకు ఉరితాడుగా భావించే చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను విన్నవించుకునేందుకు గవర్నర్​ దగ్గరికి వచ్చామన్నారు. అది పట్టించుకోకుండా కాంగ్రెస్​ నేతలది రాజకీయ డ్రామా అంటూ అవహేళన చేయడం బాధించిందని చెప్పారు.